హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తేతెలంగాణ) : తెలంగాణలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎకువగా ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. చలికి తోడు భారీ పొగ మంచు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం మెదక్‌లో అత్యల్పంగా 14.8 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్‌లో 15.7 డిగ్రీల సెల్సియస్, పటాన్చెరులో 16.2, దుండిగల్‌లో 18, నిజామాబాద్‌లో 18.7, రామగుండం, హనుమకొండ, హకీంపేటల్లో 19, హైదరాబాద్‌లో 19.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదుకాగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. కొన్నిచోట్ల 32 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో ఆస్తమా, ఫ్లూ వంటి వైరస్ వ్యాప్తి ఎకువగా ఉంటుందన్నారు. ఉదయం, రాత్రి వేళల్లో అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని.. ఉన్ని దుస్తులు ధరించాలని, పిల్లలు, వృద్ధులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.