హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పెరిగిన హత్యలు, అత్యాచారాలను పోలీస్ శాఖ కప్పిపుచ్చే ప్రయత్నం చేసినప్పటికీ జైళ్ల శాఖ విడుదల చేసిన వార్షిక నివేదికలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. డీజీపీ శివధర్‌రెడ్డి ఇటీవల విడుదల చేసిన వార్షిక నేరాల నివేదిక-2025కు, సోమవారం జైళ్ల శాఖ విడుదల చేసిన వార్షిక నివేదికకు ఏమాత్రం పొంతన కుదరలేదు. 2024లో దారుణ నేరాలు పెరిగి 38,079 మంది నిందితులు జైళ్లకు వెళ్లగా.. 2025లో ఆ సంఖ్య 12% పెరిగి 42,566కు చేరినట్టు జైళ్ల శాఖ నివేదిక స్పష్టం చేస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల విమర్శించారు.
డిసెంబర్ 21న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘గత రెండేండ్లుగా జంట నగరాల్లో నడిరోడ్డుపై పట్టపగలే హత్యలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకున్నవారే లేరు. ఎన్సీఆర్బీ రిపోర్టు ప్రకారం తెలంగాణలో నేరాల రేటు 20% పెరిగింది. బీఆర్ఎస్ హయాంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు ఎవరికీ భద్రత లేకుండా పోయింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్రంలో జరిగిన నేరాలను పోలీసులు తగ్గించి చూపుతున్నారు. 2025లో రాష్ట్రవ్యాప్తంగా 819 రేప్ కేసులు సహా 2,570 పోక్సో కేసులు నమోదైనట్టు ఇటీవల విడుదల చేసిన నివేదికలో డీజీపీ పేర్కొన్నారు.
కానీ, గత 12 నెలల్లో ఏకంగా 4,176 మంది పోక్సో కేసుల్లో జైళ్లపాలైనట్టు జైళ్ల శాఖ వెల్లడించింది. అంటే 2024తో పోల్చితే నిరుడు పోక్సో కేసుల్లో నిందితుల సంఖ్య 11.36% పెరిగింది. హత్య కేసుల గణాంకాలు కూడా ఇలాగే ఉన్నాయి. నిరుడు రాష్ట్రంలో 781 హత్య కేసులు, 70 మర్డర్ ఫర్ గెయిన్ కేసులు, 220 కల్పబుల్ హోమిసైడ్ కేసులు నమోదైనట్టు పోలీస్ శాఖ వెల్లడించింది. ఇవన్నీ కలిపితే 1,070 కేసులే లెక్కకొస్తున్నాయి. కానీ, హత్య కేసుల్లో ఏకంగా 3,260 మంది జైళ్లపాలైనట్టు జైళ్ల శాఖ స్పష్టం చేసింది. కాగా, మహిళలపై నేరాలకు పాల్పడినందుకు 2025లో 3,478 మంది జైళ్లపాలయ్యారు. దీంతో ఈ నేరాలు 2024 కంటే 5.23% పెరిగాయి.