హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అతి పెద్దదైన దసరా పండుగ నేపథ్యంలో నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి పోయేవారి సంఖ్య అధికమైంది. ఇప్పటికే బస్సులు, ప్రైవేటు వాహనాల్లో చాలామంది సొంతూళ్లకు చేరుకున్నారు. అయినప్పటికీ రైళ్ల ద్వారా ప్రయాణం చేసేవారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. దసరా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ప్రయాణాలు మరింత పెరిగాయి. కుటుంబ సమేతంగా వెళ్తుండడంతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. పలు రైల్వేస్టేషన్ల నుంచి అదనపు రైళ్లు ఏర్పాటుచేసినప్పటికీ అవి కూడా సరిపోవడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక రైళ్లలో 30 నుంచి 50 శాతం వరకు అదనపు చార్జీలు వసూలు చేస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు రెగ్యులర్ రైళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రయాణికుల రద్దీకి తగిన సౌకర్యాలు కల్పించలేదని రైల్వే అధికారులపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
6,304 స్పెషల్ బస్సులు..
సద్దుల బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 6,304 ప్రత్యేక బస్సులను టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటుచేసింది. ఈసారి మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంతో రద్దీ దృష్ట్యా గత ఏడాదితో పోల్చితే అదనంగా 600 స్పెషల్ సర్వీసులను తిప్పాలని నిర్ణయించింది. బుధవారం నుంచి ఈ నెల 14 వరకు అధిక రద్దీ ఉండే అవకాశముండటంతో ఆ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నది. జేబీఎస్ నుంచి 1,602, ఎల్బీనగర్-1193, ఉప్పల్-585, ఆరాంఘర్ నుంచి 451 అదనపు బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.