‘మేం అధికారంలోకి వస్తే మీపై ఉన్న ఆదాయపు పన్ను భారం రద్దుకు కృషి చేస్తాం..లేదంటే మేమే భరిస్తాం.’ అంటూ సింగరేణి కార్మికులను కాంగ్రెస్ మభ్యపెట్టింది. ఓడ దాటాక బోడ మల్లన్న అన్నట్లు ఇచ్చిన హామీని తుంగలో తొక్కింది. అధికారంలోకి వచ్చి పదినెలలైనా అటు నేతలు, ఇటు కార్మిక నాయకులు పట్టించుకోకపోవడంతో నల్లసూరీళ్లు మండిపడుతున్నారు. హక్కుల సాధన కోసం ఉద్యమబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.
Singareni | జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): నల్లనేలలో బీఆర్ఎస్ పాలన.. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) మార్క్ చెరగని ముద్ర. గని కార్మికులు మళ్లీ ఆ రోజులను గుర్తు చేసుకుంటున్నారు. చెప్పని హామీలు సాధించి పెట్టిన సంఘాన్ని, కేసీఆర్ పనితీరును నెమరేసుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కారు పదినెలల పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి పదినెలలైనా ఇచ్చిన హామీలపై నోరు మెదపడం లేదని మండిపడుతున్నారు. సింగరేణి కార్మికులు ఆదాయపు పన్ను రద్దు చేయాలని ఏనాటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గత ఎన్నికల్లో తమను గెలిపిస్తే ఆదాయపు పన్ను రద్దుకు కృషి చేస్తామని, అవసరమైతే ప్రభుత్వమే భరిస్తుందని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ను నమ్మిన కార్మికులు 11 డివిజన్లలో హస్తానికి మద్దతు పలికారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నోరు మెదపకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోలిండియాలో అలవెన్స్‌లపై పన్ను రద్దు పదేండ్లుగా జరుగుతున్నా ఇక్కడ కేవలం అధికారులకే పరిమితమైంది. ఈ విషయమై గుర్తింపు కార్మిక సంఘం సైతం మాట్లాడే పరిస్థితి లేదు.
నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, నేడు అధికారంలో ఉన్న బీజేపీ ఆదాయపు పన్నును రద్దు చేయలేకపోయాయి. ప్రాణాలకు తెగించి భూమి పొరల్లోకి వెళ్లి బొగ్గును వెలికితీసి దేశానికి వెలుగులు అందిస్తున్న బొగ్గుగని కార్మికులకు నేవీ, ఆర్మీ సైనికుల వలె ఆదాయపు పన్ను రద్దు చేయాలని ఏండ్ల తరబడి పోరాటం కొనసాగుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి ఏరియాలోని బొగ్గు గనుల్లో రేవంత్‌రెడ్డితోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక నేతలందరూ ప్రచారం నిర్వహించారు. తాము గెలిస్తే ఆదాయపు పన్ను బాధ మీకు ఉండదని కార్మికులకు భరోసా ఇచ్చారు. హామీ ఇచ్చే సమయంలో సింగరేణిలో 39,748 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతుంది. ఒక్క నాయకుడూ ఈ విషయమై నోరు మెదపడం లేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం సింగరేణిలో సుమారు 40వేల మంది కార్మికులపై ఆదాయపు పన్ను భారం పడుతుంది. కష్టించి పనిచేసిన వేతనం ఆదాయపు పన్నుకే పోతుందని వాపోతున్నారు.
సింగరేణి కార్మికులకు పది రకాల అలవెన్స్‌లు ఉన్నాయి. జీతభత్యాలతోపాటు అలవెన్స్‌లు కలుపడంతో ఉద్యోగుల స్లాబ్ పరిధి పెరుగుతున్నది. అలవెన్స్‌ల రూపంలో ఏటా రూ. 3లక్షల వరకు వస్తుండగా వార్షిక ఆదాయం కింద పన్ను భారం పడుతుంది. యాజమాన్యమే పన్ను చెల్లిస్తే కార్మికులకు దాదాపు రూ. 35వేల నుంచి రూ.80 వేల భారం తగ్గే అవకాశం ఉంది. సింగరేణి ఎన్నికల సమయంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు పెర్క్ అలవెన్స్‌లపై రీయింబర్స్మెంట్ చేయిస్తామని ఇచ్చిన హామీకి అతీగతి లేదు.
కాంగ్రెస్ నేతలు, ఐఎన్టీయూసీ నాయకులు తాము గెలిస్తే ఆదాయపు పన్ను రీయింబర్స్ చేస్తామని హామీ ఇచ్చారు. కోలిండియాలో అలవెన్స్‌లపై ఆదాయపు పన్నును అక్కడి యాజమాన్యమే భరిస్తున్నది. ఇక్కడ ఎందుకు అలా జరగడం లేదు. ఇక్కడ కేవలం అధికారులకు మాత్రమే సంస్థ భరిస్తుంది. ఉద్యమాలతోనే కార్మికుల హక్కులు పరిష్కారమవుతాయి. గెలిచిన పార్టీ, గెలిచిన యూనియన్లతో ఒరిగేదేం లేదు.