హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్, బీజేపీలకు చెందిన మాజీ సర్పంచులు, కీలక నేతలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్లో చేరారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అనుచరులు ఆ పార్టీని వీడి గులాబీ కండువా కప్పుకొన్నారు. కాంగ్రెస్ నుంచి పలువురు మాజీ సర్పంచులు, కీలక నేతలు బీఆర్ఎస్లో చేరగా వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలం కావడం, ప్రజల్లో ఆ పార్టీపై పూర్తిస్థాయిలో వ్యతిరేకత రావడం వంటి కారణాలతో జమ్మికుంట మండలానికి చెందిన పలువురు మాజీ సర్పంచులు, కీలక నేతలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. వారిలో తనుగుల మాజీ సర్పంచ్ రామస్వామి, శంభునిపల్లి మాజీ సర్పంచ్ వెంకట్‌రెడ్డి, పాపకపల్లి మాజీ సర్పంచ్ మహేందర్, శాయంపేట మాజీ సర్పంచ్ భద్రయ్య, నాగంపేట మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, రాచపల్లి సదానందం, జైద శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ మోసపూరిత పాలనతో ప్రజలు విసిగిపోయారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి విమర్శించారు. రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని వాపోయారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో రామరాజ్యం నడిచిందని, ఇప్పుడు రాక్షస పాలన నడుస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలంతా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారని, ఇకనుంచి రాబోయే అన్ని ఎన్నికల్లో గులాబీ పార్టీ జయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తంచేశారు.