నర్సాపూర్/శివ్వంపేట, నవంబర్ 1: పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని అటవీ ప్రాంతంలో అప్పటి సీఎం కేసీఆర్ ఫారెస్ట్ అర్బన్ పార్కును ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న నర్సాపూర్ అర్బన్ పార్కుకు అప్పట్లో కేసీఆర్ రూ. 3 కోట్లు కేటాయించి కాటేజీలు, రిసెప్షన్ సెంటర్, స్విమ్మింగ్‌పూల్ తదితర నిర్మాణాలు చేపట్టారు. వీటిని శనివారం అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్థానిక ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని అటవీశాఖ అర్బన్ ఎకో పార్కు రాష్ర్టానికి తలమానికంగా నిలుస్తున్నదని కొనియాడారు. తెలంగాణలో ఒక అరుదైన పార్కును ఏర్పాటు చేయడం సంతోషంగా ఉన్నదని అన్నారు. పార్కులో ఏర్పాటు చేసిన వేదికలు, లగ్జరీ సదుపాయాలు, పిక్నిక్ స్పాట్స్, ఈవెంట్స్ నిర్వహించుకునేలా సౌకర్యం, పచ్చదనం లాంటివి సందర్శకులను ఆకట్టుకుంటున్నాయని పేర్కొన్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ.. ఎకో పార్కు చెరువు కలుషితం కావొద్దని తెలిపారు.
నర్సాపూర్ నియోజకవర్గానికి అడవే పెద్ద ఆస్తి అని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ నర్సాపూర్ ఫారెస్ట్‌ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అర్బన్ ఎకో పార్కుకు నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. నర్సాపూర్ చెరువుకు నల్లవల్లి-ప్యారానగర్ నుంచి వర్షపు నీరు వస్తుందని, ప్యారానగర్లో జీహెచ్ఎంసీ డంపింగ్‌యార్డు ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలని సూచించారు. లేకుంటే ప్రజలతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు.