నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్, మే 20 : కుల వృత్తులకు జీవం పోసింది సీఎం కేసీఆర్ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కుల వృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కులవృత్తులపై ఆధారపడి బతుకుతున్న కుటుంబాలకు రూ.లక్ష ఆర్థికసాయం చేయాలని సర్కారు నిర్ణయించడంపై శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వృత్తిదారులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కరీంనగర్లో రజక సంఘం నాయకులు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపి మంత్రి గంగులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వృత్తిదారులకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించాలని నిర్ణయించిందని చెప్పారు. దీన్ని ప్రతి ఒకరూ వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర నాయకులు మైఖేల్ శ్రీనివాస్, పూసల శ్రీకాంత్, మారెట్ కమిటీ డైరెక్టర్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
కులవృత్తులపై ఆధారపడి బతుకుతున్న కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం చేయాలని సర్కారు నిర్ణయించడంపై శనివారం కరీంనగర్‌లోని తెలంగాణచౌక్‌లో నాయీబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు నీలం మొండ య్య ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి గంగులతో కూడిన ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు నర్సయ్య, ప్రధాన కార్యదర్శి జయరాం, నగర అధ్యక్షుడు సంపత్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ పాల్గొన్నారు. కాగా నల్లగొండలోని గడియారం సెంటర్లో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి ఎంబీసీ కులాల ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భం గా ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేసీఆర్ ప్రభుత్వం బడుగులకు బాసటగా నిలుస్తున్నదని అన్నారు. కార్యక్రమం లో రజక సంఘం జిల్లా అధ్యక్షుడు చిలుకరాజు చెన్నయ్య, నాయీబ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు నాంపల్లి శ్రీనివాస్, బీసీ, ఎంబీసీల నాయకులు నోముల రవి, కృష్ణయ్య, బ్రహ్మచారి, చింతల వెంకన్న, శ్రీకాంత్, లక్ష్మణ్, యాదగిరి, విజయ్, మారయ్య తదితరులు పాల్గొన్నారు.