మక్తల్, జనవరి 26 : గణతంత్ర దినోత్సవ( Republic Day) వేడుకల సందర్భంగా నారాయణపేట జిల్లాలో అపశృతి చోటు చేసుకుంది. మక్తల్ తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ జెండా(National flag) ఆవిష్కరిస్తుండగా జెండాకు అమర్చిన కర్ర విరిగిపడటంతో ఒకరికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉదయం 9:30 గంటలకు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని తహసీల్దార్ సతీష్ కుమార్ ఆవిష్కరించారు.
ఈ క్రమంలో జాతీయ జెండాకు అమర్చిన కర్ర విరిగి కింద పడడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాగేందర్ అనే వ్యక్తి కాలు పై పడి గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా, ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి వాకిటి శ్రీహరికి తృటిలో ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.