హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులకు చెల్లించాల్సిన ఫీజులను వారి ఖాతాలో ప్రభుత్వం నేరుగా జమ చేశాక వసూలు చేసుకోవాలని, అంతవరకు అడ్మిషన్ల సమయంలో ఫీజు చెల్లింపునకు ఒత్తిడి తీసుకురావద్దన్న ప్రభుత్వ నిబంధన అమలును నిలిపివేస్తూ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. గతంలో హైకోర్టు జారీచేసిన ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని తప్పుబట్టింది. ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవహారానికి సంబంధించిన గడువు నేపథ్యంలో ప్రభుత్వం బుధవారం జారీచేసిన జీవో-7లోని 5వ పేరా 12వ నిబంధనను పరిశీలించిన అనంతరం పై విధంగా స్పందించింది.
ఇటీవల ఇదే హైకోర్టు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా ఈ జీవో ఉన్నదని ఆక్షేపించింది. ఫీజు రీయింబర్స్మెంట్ నేపథ్యంలో ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం జారీచేసిన జీవోలను సవాల్ చేస్తూ పలు ప్రైవేటు కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ జువ్వాది శ్రీదేవి మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.. విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకోవడానికి అనుమతించారు.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు అవినాశ్ దేశాయ్, ఎల్ రవిచందర్ వాదనలు వినిపిస్తూ గత ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయకుండా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు గడువు గురించి చెప్పకుండా ఏప్రిల్ 29న జీవో-7 జారీ చేసిందని చెప్పారు. ఈ జీవో ప్రకారం విద్యార్థుల నుంచి నేరుగా ఫీజు వసూలు చేయడానికి అవకాశం లేకుండా పోయిందని అన్నారు. ఏప్రిల్ 2న హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందని తెలిపారు.
జీవోలోని 5వ పేరా 12వ నిబంధన ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులకు సంబంధించిన ఫీజులను డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) పద్ధతిన నేరుగా విద్యార్థుల ఖాతాకు ప్రభుత్వం జమ చేస్తుందని, ఆ తరువాత విద్యార్థులు టీఏఎస్ఆర్సీ నిర్ణయించిన మొత్తాలను ఖాతాల నుంచి చెల్లిస్తారని పేరొన్నదని వివరించారు. ఈ నిబంధన వల్ల కాలేజీలు ఫీజులను వసూలు చేసే పరిస్థితి లేదని, అందువల్ల ఆ నిబంధనను నిలిపివేయాలని కోరారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం జీవోను 29న విడుదల చేసినట్టు గురువారం ఉదయం తెలిసిందని చెప్పారు.
పిటిషనర్లు చెప్తున్న నిబంధన గత మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నదని అంగీకరించారు. దీనిపై వివరణ తెలుసుకుని చెప్పడానికి సోమవారం వరకు గడువు కావాలని కోరారు. కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు గడువు, ఏఏ కాలేజీలకు టోకెన్లు జారీ, తదితర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయడానికి గడువు కావాలని కోరారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి ప్రభుత్వం జారీచేసిన జీవోలోని నిబంధనను ప్రాథమికంగా పరిశీలిస్తే గత మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఇది కోర్టు ధికరణగా పరిగణించాల్సి ఉంటుందని అన్నారు. ఫీజు వసూలు నిబంధనపై వివరణ ఇవ్వడానికి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సోమవారం వరకు గడువు కోరిన నేపథ్యంలో ఈ నిబంధనను మే 4వ తేదీ వరకు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. తదుపరి విచారణను అదే తేదీకి వాయిదా వేశారు.