BRS | హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ దెబ్బకు మహారాష్ట్ర సర్కార్ దిగొచ్చింది. తెలంగాణ మాడల్‌ను అమలు చేయాలని మహారాష్ట్ర రైతాంగం చేస్తున్న డిమాండ్‌కు ఉక్కిరిబిక్కిరైన మహారాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు అక్కడి రైతాంగానికి కొత్త పథకాన్ని ప్రకటించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ‘నమో షేత్కరీ మహా సమ్మాన్ నిధి’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. క్యాబినెట్ భేటీ అనంతరం సీఎం ఏక్నాథ్ షిండే మీడియాతో మాట్లాడుతూ.. ఈ పథకం కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే రూ.6 వేలతోపాటు మహారాష్ట్ర సర్కార్ కూడా మరో రూ.ఆరు వేలు అందజేస్తుందని వెల్లడించారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.రెండు వేల చొప్పున లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద పీఎం కిసాన్ పోర్టల్‌లో నమోదైన అర్హులైన లబ్ధిదారులకు ఈ సాయం అందజేయనున్నట్టు తెలిపింది. పథకం అమలు పర్యవేక్షణ కోసం గ్రామ, తాలూకా, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను నియమిస్తున్నట్టు వెల్లడించారు.
ఇదీ నేపథ్యం
తెలంగాణ మాడల్‌ను అమలు చేయాలని మహారాష్ట్ర రైతాంగం బీఆర్ఎస్ నేతృత్వంలో పోరాటం చేస్తున్నది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇటీవల నిర్వహించిన నాందేడ్, కంధార్-లోహా, ఔరంగాబాద్ సభలకు విశేష స్పందన లభించింది. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 22 వరకు మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలంగాణ మాడల్‌ను విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. మరోవైపు మహారాష్ట్రలోని గాంధేయవాది, సంఘ సేవకుడు వినాయక్‌రావ్ పాటిల్ మహారాష్ట్ర రైతులకు తెలంగాణ మాడల్‌ను అమలు చేయాలని ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఐదు రోజులపాటు ఆయన చేపట్టిన దీక్షకు విశేష స్పందన వచ్చింది. ఏక్నాథ్ షిండే సర్కార్ వినాయక్‌రావ్ పాటిల్‌ను చర్చలకు ఆహ్వానించింది. తెలంగాణ మాడల్‌పై అధ్యయనం చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ పరిణామాల నేపథ్యంలో నమో షేత్కరీ మహాసమ్మాన్ నిధి పథకాన్ని ప్రకటించడం గమనార్హం.
ఇది బీఆర్ఎస్ తొలి విజయం: మాణిక్ కదం
తెలంగాణ మాడల్ కోసం రైతులు ఉద్యమిస్తున్నారనే విషయాన్ని మహారాష్ట్ర సర్కార్ గుర్తించడం బీఆర్ఎస్ సాధించిన తొలి విజయమని మహారాష్ట్ర బీఆర్ఎస్ రాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్ కదం తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో అడుగుపెట్టగానే ఏక్నాథ్ షిండే సర్కార్ ఉలిక్కిపడిందని చెప్పారు. అందులో భాగమే నమో షేత్కరీ మహా సమ్మాన్ నిధి పథకమని చెప్పారు. దేశంలో ఆత్మహత్యకు పాల్పడే రైతుల్లో 38% మంది మహారాష్ట్ర వాసులేనని, రైతులకు అండగా బీఆర్ఎస్ నిలిస్తే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని గ్రహించే షిండే సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు. మహారాష్ట్ర రైతులు కోరుకున్నది నెలకు వెయ్యి రూపాయలు కాదని స్పష్టంచేశారు. మహారాష్ట్రలో తెలంగాణ మాడల్‌ను అమలు చేసే దాకా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని చెప్పారు. మహారాష్ట్రలో రాజకీయ నిర్ణయాలు కాదు తీసుకోవాల్సింది.. సీఎం కేసీఆర్ చెప్పినట్టు రాజనీతిజ్ఞతతో కూడిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Kcr
ఎమ్మెల్యే వనమాకు సీఎం కేసీఆర్ ఫోన్
ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రాత్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు ఫోన్ చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని పోడు పట్టాల గురించి ఆరా తీశారు. నియోజకవర్గంలోని సింగరేణి స్థలాలు, రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి పనుల గురించి సీఎం కేసీఆర్ చర్చించినట్టు ఎమ్మెల్యే వనమా మీడియాకు వెల్లడించారు.