హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు హర్షరెడ్డి గతంలో అదనపు డైరెక్టర్‌గా ఉండి రాజీనామా చేసిన ఏక్యూ స్కేర్ రియల్టర్స్ కంపెనీ ప్రతినిధులు రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్లోని సర్వే నంబర్ 613 భూముల చుట్టూ అబద్ధాల కంచె వేసేందుకు ప్రయత్నించారు. కేవలం కోర్టు తీర్పులను ఉటంకిస్తూ రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా ఉన్న వాటిని సైతం పట్టా భూములుగా అభివర్ణించారు.
మంత్రి పొంగులేటి కుటుం బం రూ.7 వేల కోట్ల విలువైన ఈ ప్రభుత్వ భూములను చెరబడుతున్న తీరును బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు ఆధారాలు సహా ఆదివారం బయటపెట్టడంతో ప్రభుత్వ పెద్దలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు స్పష్టమవుతున్నది. ఆదివారం రాత్రి పత్రికా ప్రకటన విడుదల చేసిన కంపెనీ, సోమవారం ప్రెస్‌మీట్ ఏర్పాటుచేసింది. ఏక్యూ స్కేర్ రియల్టర్స్ కంపెనీ న్యాయవాది మాధవరావు, శివరాజ్ బహదూర్ వారసుడిగా అనూజ్రాజ్ సమాధానమే ఇవ్వలేదు.
మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆదివారం రోజే రాత్రికి రాత్రి ఏక్యూ స్కేర్ రియల్టర్స్ కంపెనీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. అందులో 373.22 ఎకరాలు ప్రభుత్వ భూములే అయినా అధికారులు స్వాధీనం చేసుకోలేదని పేర్కొన్నారు. కానీ సోమవారం నిర్వహించిన ప్రెస్మీట్లో శివరాజ్ బహదూర్ వారసుడు అని చెప్తున్న అనూజ్రాజ్ మాత్రం అసలు కలెక్టర్ ఆ భూముల్ని నిషేధిత జాబితాలోనే పెట్టలేదని చెప్పారు.
వెంటనే కలెక్టర్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు పంపిన లేఖను చూపించడంతో ఐటీ శాఖ ఇచ్చిన లేఖ కారణంగా వాటిని నిషేధిత జాబితాలో పెట్టారేగానీ ప్రభుత్వ భూములు అని పేర్కొనలేదని బుకాయించారు. చివరికి జర్నలిస్టులు ‘స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్స్’గా ఉన్న ఆధారాలు చూపడంతో మౌనం వహించారు. 2006లో కరీం అల్లావుద్దీన్కు సుమారు 260 ఎకరాల వరకే ఏజీపీఏ చేయగా 373.22 ఎకరాలను ఎలా స్వాధీనం చేసుకుంటారని అడగ్గా పది ఏజీపీఏలు ఉన్నాయని అందులో 373 ఎకరాలుందని ఆ డాక్యుమెంట్లు కావాలంటే ఇస్తానని చెప్పారు. కానీ ఆ డాక్యుమెంట్లు ఇవ్వకుండానే వెళ్లిపోయారు.
నాదర్గుల్ భూముల వ్యవహారం ప్రస్తుతం కోర్టు వివాదాల్లో ఉన్నదని, ఈ క్రమంలో పత్రికలు కథనాలు ఎలా ప్రచురిస్తాయని కంపెనీ తరఫు ప్రతినిధి మాధవరావు ప్రశ్నించారు. ఇలా చేయడం కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని హెచ్చరించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మరి కోర్టు వివాదాల్లో ఉన్న భూముల చుట్టూ ప్రహరీ నిర్మాణానికి గత ఫిబ్రవరిలో బడంగ్‌పేట సర్కిల్ అధికారులకు అనుమతి కోసం ఎందుకు దరఖాస్తు చేశారని జర్నలిస్టులు ప్రశ్నించగా తమకు ఇన్‌జంక్షన్ ఉత్తర్వులు ఉన్నాయని, తమ భూముల చుట్టూ తాము ప్రహరీ నిర్మించుకోవచ్చని చెప్పారు.
సీలింగ్ చట్టం పరిధిలోకి వచ్చే భూములకు ఇన్‌జంక్షన్ వర్తించదని చెప్పగా అలాంటి ప్రశ్నలకు తాము కోర్టులో సమాధానం చెప్పుకొంటామని దాటవేశారు. అలాంటప్పుడు మీడియా సమావేశం ఎందుకు నిర్వహించారని అడిగితే సమాధానం చెప్పలేదు. కోర్టు కేసు ఉండగా, నాదర్గుల్ రైతులతో ప్రైవేట్ ఒప్పందాలు ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు. దీంతో అనూజ్ రాజ్ ఎవరితోనూ ఒప్పందాలు చేసుకోలేదని బుకాయించారు. ఆ డాక్యుమెంట్‌ను చూపించే ప్రయత్నం చేయగా కనీసం డాక్యుమెంట్‌ను చూసేందుకు కూడా ఇష్టపడకుండా దాటవేత ధోరణి ప్రదర్శించారు. వివాదం కోర్టులో ఉన్నప్పుడు ఏక్యూ స్కేర్ రియల్టర్స్‌తో డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఎలా చేసుకుంటారంటే దానికీ సమాధానం చెప్పలేదు.
నాదర్గుల్లోని భూములు ముమ్మాటికీ తమ భూములేనని అనూజ్రాజ్ వాదించారు. ఈ క్రమంలో టైటిల్ లేకుండా మా భూములు అని ఎలా అంటారని ప్రశ్నిస్తే.. టైటిల్ అవసరం లేదని, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సరిపోతాయని న్యాయవాది మాధవరావు చెప్పడం విడ్డూరం. అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం-1975 వర్తిస్తుంది కదా? అని ప్రశ్నించగా, కోర్టుకు చెప్పుకొంటామన్నారు. కోర్టుకు చెప్పుకొనేది ఉంటే ప్రెస్‌మీట్ ఎందుకు పెట్టారని జర్నలిస్టులు ప్రశ్నించారు. తామే సంపూర్ణ యజమానులమంటున్న శివరాజ్ బహదూర్ వారసులు మ్యుటేషన్ ఎందుకు చేయించుకోవడం లేదు? అని అడగ్గా సమాధానాన్ని దాటవేశారు.
ఆ భూములు వ్యవసాయ యోగ్యం కానివిగా చెబుతున్నారు గానీ మరోవైపు రైతులు దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్నారు. పైగా ఇందిరా ఆవాస్ యోజన కింద బోర్లు, బావులకు కేంద్రం ఆర్థిక సాయం చేసిందని ప్రస్తావిస్తే న్యాయవాది మాధవరావు సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. ఆ భూములతో ఏక్యూ స్కేర్ రియల్టర్స్‌కు సంబంధం ఉన్నదని అనడంతో జర్నలిస్టులు మరి బోర్డుపై రోజుకో కంపెనీ ఎందుకు వస్తున్నదని అడగ్గా అలాంటిదేమీ లేదని చెప్పడం గమనార్హం.