హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ జార్ఖండ్, దక్షిణ హర్యానా మీదుగా తుఫాను ఏర్పడనుందని, దీని ప్రభావం సమీప ప్రాంతాలపై ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. ద్రోణి కారణంగా రుతుపవనాలు కూడా వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా వ్యాపించాయని తెలిపింది.
శుక్రవారం నుంచి ఈ నెల 15 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో వారం పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం కూడా పలు జిల్లాల్లో చిరుజల్లులు పడ్డాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో జయశంకర్-భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో అత్యధికంగా 3.27 సెం.మీ వర్షపాతం నమోదైంది.