Weather Updates | హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): ఉత్తరప్రదేశ్ నుంచి పశ్చిమ బంగాళాఖాతం వరకు కొనసాగిన ఆవర్తన ద్రోణి బలహీన పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తా సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఈనెల 17వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది.
బుధవారం భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాతోపాటు ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసినట్టు వెల్లడించింది. గురు, శుక్ర, శని, ఆదివారాల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వివరించింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసినట్టు తెలిపింది. రాబోయే 48 గంటలు ఆకాశం మేఘావృతమై ఉండి, హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతోపాటు, ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. 24 గంటల్లో భద్రాది కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో అత్యధికంగా 8.22 మి.మీ వర్షపాతం నమోదైనట్టు తెలిపింది.
నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన మొదటి పది రోజుల్లో కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ-గద్వాల, వికారాబాద్, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో అత్యంత లోటు వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. మహబూబాబాద్, నాగర్కర్నూల్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సిద్దిపేట, జనగాం, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని పేర్కొన్నది. జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో అధిక వర్షపాతం నమోదు కాగా, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో అత్యంత అధిక వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.