జనగామ, మే 21(నమస్తే తెలంగాణ): జనగామ జిల్లాలో అక్రమార్కులు ఇసుకను అడ్డగోలుగా తోడేస్తున్నారు. రాత్రిపూట గుట్టుచప్పుడు కాకుండా ఇష్టారీతిలో ఇసుక దందాను కొనసాగిస్తున్నారు. నీటి జాడలు అడుగంటకుండా కాపాడే చెరువులు, కుంటలు, వాగులు, వంకల్లో ఉన్న ఇసుక మేటలను దళారులు రాత్రికి రాత్రే ఖాళీ చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను ఆపాల్సిన సంబంధిత మైనింగ్‌శాఖ అధికారులతోపాటు రెవెన్యూ, పోలీసు యంత్రాంగం పట్టించుకోకపోవడం గమనార్హం.
తాజాగా జనగామ మండలం చీటకోడూరులోని ఫేస్ వన్ చెక్ డ్యాం నుంచి హిటాచీ యంత్రం తో ఇసుకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలించి గ్రామ శివారులో డంపు చేస్తున్నారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే ఇసుక తరలింపునకు ప్రభుత్వం నుంచి అనుమతులు లేవని, అక్రమంగా రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు తప్ప.. వారిపై ఎలాంటి చర్య లూ తీసుకోవడం లేదని రైతులు, ప్రజలు వాపోతున్నారు.