తాండూరు , నవంబర్ 6 : రోడ్ల దుస్థితిపై నిరసన తెలిపిన 25 మందిపై తాండూర్ (Tandur) పోలీసులు కేసు నమోదు చేశారు. వికారాబాద్ జిల్లా చేవెళ్ల (Chevella Accident) సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో తాండూర్ నియోజకవర్గానికి చెందిన 13 మంది మృతి చెందారు. రోడ్లు బాగా లేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయంటూ తాండూర్ డెలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 4న స్థానిక విలియమూన్ స్కూల్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసనలో వందలాది మంది యువకులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం.. ధర్నా చేసేందుకు ప్రధాన కారకులైన 25 మందిపై అక్రమ కేసులు పెట్టించిందంటూ ఫోరం ప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు భగ్గుమన్నారు.
అక్రమ కేసులను వెంటనే కొట్టివేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తీరుపైనా మండిపడ్డారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, రాష్ర్ట బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, అబ్దుల్ నయ్యూం మాట్లాడుతూ.. తాండూర్ డెవలప్మెంట్ ఫోరం నేతలపై కేసులు పెట్టడం దారుణమని అన్నారు. చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో తాండూర్ వాసులు మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. అప్పా జంక్షన్ నుంచి రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. రోడ్లు బాగా లేకపోవడం వల్లే ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. రోడ్లుబాగు చేయాలని డెవలప్మెంట్ ఫోరం నేతలు ధర్నా చేస్తే కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
రోడ్డుపై ధర్నా చేసి రవాణా వ్యవస్థకు అంతరాయం కల్గించారంటూ 25 మందిపై తాండూర్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. తాండూర్ డెవలప్మెంట్ ఫోరం నాయకులు కమల్ అతర్, గోపాల్‌కృష్ణ, రాజ్‌కుమార్, బాషిత్, రాజుగౌడ్, జావేద్, ఆసీఫ్, సంగీత్ ఠాకూర్, శోభారాణి, పరిమళ, అనిత, ఆదిల్, ఫయ్యుమ్, విజయలక్ష్మి పండిత్, మల్లేశం తదితరులపై కేసు నమోదు చేశారు.