హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): విద్యారంగ సమస్యలపై ప్రశ్నిస్తున్న విద్యార్థి నేతలపై కాంగ్రెస్ సర్కార్ అడ్డగోలుగా అక్రమ కేసులను బనాయిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలో విద్యావ్యవస్థను పూర్తిగా భ్రషు పట్టించిందని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతి ఒకరికీ వ్యతిరేకంగా పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుతున్నదని మండిపడ్డారు. విద్యారంగ సమస్యలపై పోరాడే ప్రతి ఒక విద్యార్థి విభాగం కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లోని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ నివాసంలో బుధవారం విద్యార్థి నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు అద్భుతమైన పాత్ర పోషించారని, ఇప్పుడు ప్రజా సమస్యలపై పోరాడుతుంటే, వారిపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం దారుణమని విమర్శించారు. ఇది ప్రశ్నించే గొంతుకలను అణిచివేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న పోలీస్ రాజకీయం ఇక చెల్లదని స్పష్టంచేశారు. సోషల్ మీడియాలో శశిధర్‌గౌడ్ అనే యువకుడు నల్లబాలు పేరుతో రీట్వీట్ చేసినా కేసు, మీడియా సంస్థల ముందు శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్లినా అక్రమ కేసులు మోపుతున్నారని విమర్శించారు. గెల్లు శ్రీనివాస్ భార్య శ్వేత ఇంటిలో ఉన్నప్పటికీ కేసు పెట్టి పోలీస్‌స్టేషన్‌కు పిలవడం రాష్ట్రంలో నెలకొన్న అరాచక పరిస్థితులకు నిదర్శనమని మండిపడ్డారు.
రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పాలనలో పోలీసులు బడుగు, బలహీనవర్గాలపై కేసులు మోపుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ చెప్పారు. రాజ్యాంగ ప్రతిని పట్టుకొని తిరిగే ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణలో కొనసాగుతున్న అణిచివేత పరిపాలనపై ఎందుకు నోరు మెదపడం లేదు? అని ప్రశ్నించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం 20 నెలల్లోనే విద్యారంగాన్ని పతనదిశకు నెట్టింది. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నది. విద్యార్థుల హకులకోసం పోరాడే ప్రతి బీఆర్ఎస్వీ కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది’ అని కేటీఆర్ భరోసా ఇచ్చారు. విద్యార్థి నాయకులకు ఏ కష్టమొచ్చినా పార్టీ ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. గాయపడిన విద్యార్థి నాయకుడు, మేడ్చల్ జిల్లా కోఆర్డినేటర్ నర్సింగ్‌తో కేటీఆర్ స్వయంగా ఫోన్లో మాట్లాడారు. మెరుగైన చికిత్స అందేలా చూడాలని నాయకులను ఆదేశించారు. ఈ సందర్భంగా వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చిన విద్యార్థులతో కేటీఆర్ ముచ్చటించారు.