హైదరాబాద్ జూన్ 16 (నమస్తే తెలంగాణ) : రాజకీయ కక్షతోనే కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌లపై కాంగ్రెస్ సర్కారు కేసులు పెడుతున్నదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. తెలంగాణభవన్‌లో మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డితో కలిసి సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఘోష్ కమిషన్, ఏసీబీ విచారణ పేరిట ప్రజానేతలపై బురదజల్లేందుకు యత్నిస్తున్నదని మండిపడ్డారు. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, 600 రోజులు దాటినా ఉచిత బస్సు మినహా ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసుల పేరిట నాటకాలాడుతున్నదని దుయ్యబట్టారు. అందాల పోటీలకు వచ్చిన మిస్ ఇంగ్లాండ్‌తో అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాసమస్యలను పక్కనబెట్టి బీఆర్ఎస్ నేతలను విచారణ పేరిట వేధింపులకు గురిచేస్తున్నదని మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్ములా రేసుతో తెలంగాణ ఖ్యాతిని పెంచిన కేటీఆర్‌పై కక్ష సాధింపులో భాగంగానే ఏసీబీ విచారణకు పిలిచిందని ఆరోపించారు.
ఆరు గ్యారెంటీలను ఎత్తేసే కుట్రలో భాగంగా రేవంత్ ప్రభుత్వం డైవర్షన్ డ్రామాలను మొదలుపెట్టిందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి మండిపడ్డారు. రేవంత్‌కు పరిపాలన చేతకావడం లేదని, మంత్రు ల మధ్య సమన్వయ లోపం ఉందని చెప్పారు.
‘కవిత జైలుకు పోయింది..కేటీఆర్ నీకు జైలుకు పోవాలని ఉన్నదా’ అంటూ బాధ్యాతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న సీతక్క మాట్లాడటం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. అభివృద్ధిని విస్మరించి కక్ష సాధింపునకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగుతున్నదని మండిపడ్డారు.
బూటకపు కేసులతో సర్కారు నాటకమాడుతున్నదని దివ్యాంగుల కార్పారేషన్ మాజీ చైర్నన్ వాసుదేవారెడ్డి ఆరోపించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని స్సష్టం చేశారు.