గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 02:54:31

ఐకేపీ కొనుగోళ్లు 3 కోట్ల క్వింటాళ్లు

ఐకేపీ కొనుగోళ్లు 3 కోట్ల క్వింటాళ్లు

  • 6074.62 కోట్లు రైతుల ఖాతాల్లోకి
  • సేకరించిన ధాన్యం వానకాలం : 1,27,16,401.76
  • యాసంగి : 2,04,22,896.75  
  • చెల్లించిన మొత్తం (రూ.లో) వానకాలం : 2,329.15 కోట్లు
  • యాసంగి : 3,745.47 కోట్లు
  • ఐకేపీ అండగా.. అన్నదాత కడుపు నిండగా
  • 3.31 కోట్ల క్వింటాళ్ల ధాన్యం కొన్న సెర్ప్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘ప్రతీ గింజను కొంటాం’ అన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో రైతన్నలకు సంబురమైంది.. సర్కారే పంటలన్నీ కొంటే పండుగ చేసుకున్నరు.. కరోనా కష్టంకాలంలోనూ మద్దతు ధరతో పైసలన్నీ ముట్టజెప్పితే వేనోళ్ల మెచ్చుకున్నరు.. ఇంటిల్లిపాది కడుపునిండా తింటామని తృప్తిపడ్డరు.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం లక్షలాది మంది రైతులకు మేలు చేసింది.

అనుకున్నట్టుగానే రికార్డు స్థాయిలో పంటల సేకరణ పూర్తయ్యింది.  ఎఫ్‌సీఐ, పీఏసీఎస్‌, మార్క్‌ఫెడ్‌, ఐకేపీ ద్వారా రైతుల నుంచి పత్తి, వడ్లు, మక్కలు, ఇతర దిగుబడులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో ఐకేపీ కీలకపాత్ర పోషించింది. ఐకేపీ కేంద్రాల ద్వారా రైతుల నుంచి 3.31 కోట్ల క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించారు. అందుకు గానూ రూ.6074.62 కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఈ కేంద్రాల ద్వారా ప్రభుత్వం గత యాసంగిలో రికార్డుస్థాయిలో 2.04 కోట్లు, వానకాలంలో 1.27 కోట్ల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 

రెండు సీజన్లకు కలిపి 6,26,884 మంది రైతులు ఐకేపీ కేంద్రాల్లో తమ పంటను విక్రయించగా వారందరికీ చెల్లింపులు సైతం పూర్తయ్యాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గత వానకాలంలో 1,208 కేంద్రాలను ఏర్పాటుచేసిన సెర్ప్‌.. యాసంగి సీజన్‌లో వాటి సంఖ్యను 2,144కు పెంచింది. దీంతో రైతులు తమ పంటను సమీప కేంద్రాల్లోనే విక్రయించారు. రవాణా ఖర్చులు సైతం మిగిలాయి. యాసంగి సీజన్‌లో 5,06,79,903 సంచు లు, వానకాలంలో 2,84,36,047 సంచుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం గమనార్హం.  


logo