హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇచ్చే సిఫారసు లేఖలను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ సిఫారసు లేఖలను తాత్కాలికంగా పక్కనపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 15 నుంచి లేఖలను తిరిగి అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్నది.
మరోవైపు 10,01,115 సార్లు గోవింద కోటి రాసిన వారికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనున్నారు. 25 ఏండ్ల వయసు లేదా అంతకంటే తక్కువ వయసున్న వారు మాత్రమే ఈ గోవింద కోటి పథకానికి అర్హులు. గోవింద కోటి పుస్తకాలు టీటీడీ సమాచార, పుస్తక విక్రయ కేంద్రాలు, ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. గోవింద కోటి పూర్తి చేసిన వారు ఆ పుస్తకాలను తిరుమలలోని టీటీడీ పేష్కార్ కార్యాలయంలో అందిస్తే మరుసటి రోజు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు.