వరంగల్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ప్రభుత్వం భవిష్యత్‌లో భూములు పంచుతుందనో, ఆస్తులు ఇస్తదనో ఆశలు పెట్టుకోకండి. భూమి ఇస్తే ఉంటే ఉంటది, పోతే పోతది. భవిష్యత్ తరాలు మాత్రం అట్లనే ఉంటయి. అందుకే బాగా చదువుకోవాలి, ఉద్యోగం చేసి తల్లిదండ్రుల కలలు తీర్చాలి. అంతేగానీ రాజకీయాల్లోకి పోతం, సర్పంచ్ ఎలక్షన్లలో నిలబడతామని బంగారంలాంటి భవిష్యత్ నాశనం చేసుకోవద్దు..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల సభలో ఆయన ప్రసంగించారు. స్థానిక ఎన్నికల్లో ఊర్లల్లో ఉన్నవాళ్లకే ప్రాధాన్యం ఇవ్వాలని పరోక్షంగా యువతను రాజకీయాలకు దూరంగా ఉండాలన్నారు. సర్కార్ పథకాలు అందరికీ చేరాలంటే తమ పార్టీ మద్దతిచ్చే అభ్యర్థులను ఎన్నుకోవాలని అల్టిమేటమ్ జారీ చేయడమే కాకుండా తెలంగాణ కోసం ఢిల్లీని సైతం ఢీకొడ్తానని, ప్రధానిని వందసాైర్లెనా కలుస్తానని నిర్మొహమాటంగా ప్రకటించారు.
పథకాలు అందవు..
రోజుకో పంచాది పెట్టుకునేటోడు వస్తే ఊరికి నష్టం జరుగుతదని, అందుకే తమ పార్టీ మద్దతిస్తున్న వ్యక్తిని గెలిపించుకుంటే మంత్రి దగ్గర కూర్చొని నిధులు తెస్తాడని, పనులు చేస్తాడని రేవంత్ నేరుగా ఎన్నికల ప్రచారం చేశారు. ఒకవేళ అలా కాకుంటే ప్రభుత్వ పథకాలేవీ అందవని పరోక్షంగా ప్రజలను బెదిరింపులకు గురిచేశారు. గ్రామాల్లో ఉండే యువకులే ఎన్నికల్లో పోటీచేయాలని, వారు గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని పలువురు ఔత్సాహికులను నీరుగార్చే యత్నం చేశారు. ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలిసేందుకు ఒక్కసారి కాదు వందసార్లు ఢిల్లీలోని పోతానని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఉన్నత విద్యావంతులు పోటీ చేయొద్దు…
విద్యావంతులు స్థానిక సంస్థల్లో పోటీచేయొద్దని సీఎం రేవంత్‌రెడ్డి పరోక్షంగా సెలవిచ్చారు. సర్పంచ్లనో..వార్డు మెంబర్లనో చదువుకున్న యువకులు సమయం వృథా చేసుకోవద్దన్నారు. ఉన్నత విద్యావంతులు, నిరుద్యోగులు బాగా చదివి పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని, ప్రభుత్వ ఉద్యోగాలు కాకపోతే ప్రైవేట్ ఉద్యోగాలు పొందాలని సూచించారు. తల్లిదండ్రులు రూపాయి రూపాయి కూడబెట్టి పీజీలు, పీహెచ్‌డీలు చదివించింది గ్రామాలకు వచ్చి రాజకీయ కక్షలకు బలి అయ్యేందుకు కాదని పేర్కొన్నారు.
అవే పనులకు మళ్లీ పునాది రాయి
నర్సంపేటలోని వరంగల్ మెడికల్ కాలేజీ అభివృద్ధికి రెండు శిలాఫలకాలు వెలిశాయి. సెప్టెంబర్ 28, 2023న మాజీ మంత్రి హరీశ్‌రావు కాలేజీకి పనులకు శంకుస్థాపన చేయగా, అదే కాలేజీకి శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి మరోమారు శంకుస్థాపన చేశారు. నాడు రూ.183 కోట్లతో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసి కాలేజీ నిర్మాణం పూర్తి చేసి తరగతులు కొనసాగుతుండగా, తాజాగా నర్సింగ్ కాలేజీ పేరుతో రూ. 130 కోట్లతో శంకుస్థాపన చేయడం గమనార్హం. సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అన్ని అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు సంబంధించిన పనులన్నీ గతంలో కేసీఆర్ సర్కార్ మంజూరు చేసినవే కావడం విశేషం. కాకపోతే అప్పుడు ఎన్నికల కోడ్ కారణంగా వాటికి శంకుస్థాపన చేయలేకపోయినవి బీఆర్ఎస్ చెప్తున్నది. మందికి పుట్టిన బిడ్డను మన బిడ్డ అని ఎత్తుకొని ముద్దాడినట్టే ఉంది సీఎం రేవంత్‌రెడ్డి తీరు అని బీఆర్ఎస్ విమర్శిస్తున్నది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రసంగిస్తూ ‘గత ప్రభుత్వం చేయకుండా మిగిల్చిన అభివృద్ధి పనులకు ఈ రోజు సీఎం శంకుస్థాపన చేశారు’ అని నవ్వులపాలయ్యే పని చేశారు. ఎంపీ బలరాంనాయక్ మాట్లాడుతూ ఎవరెన్ని అనుకున్నా వచ్చే 15 ఏండ్లు రేవంత్‌రెడ్డే సీఎం అని అన్నారు.
సభకు రాకపోతే రూ.500 జరిమానా
సీఎం సభకు రాకపోతే రూ.500 జరిమానా కట్టాల్సిందేనని హుకుంజారీ చేశారట. ‘ఏం జేయాలయ్యా.. సభకు రాకుంటే ఐదొందల జుర్మానా అని బెదిరిచ్చిండ్లు. అందుకే వొచ్చినం’ అని ఓ మహిళ ఆవేదన చెందారు. సీఎం సభకు రావాల్సిందే అని ఐకేపీ సిబ్బంది బెదిరింపులకు గురిచేశారని పలువురు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆవేదన చెందారు. కాగా, సభకు వచ్చినందుకు తమకు రూ.200 ఇస్తామన్నారని మరికొందరు మహిళలు పేర్కొనడం గమనార్హం.
నిర్బంధ విజయోత్సవాలు
ప్రజాపాలన అంటూ పేర్కొనే సీఎం రేవంత్‌రెడ్డి తాను నిర్వహించే సభలు మాత్రం నిర్బంధాల మధ్య సాగిస్తున్నారు. సీఎం పర్యటన ఉందనగానే పోలీసులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఎక్కడిక్కడ అరెస్టులు, గృహనిర్బంధాలు చేస్తున్నారు. శుక్రవారం నర్సంపేట సభ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులను అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సహా పలువురు కార్యకర్తలను ఆధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు సభా ప్రాంగణంలో అడుగడుగునా పోలీసులే దర్శనమిచ్చారు. ‘ఎవరూ లేవకూడదు.. కూర్చోండి’ అంటూ కనుసైగతో బెదిరించారు. లోపలికి వస్తే సీఎం వెళ్లిపోయేదాకా వెళ్లడానికి వీళ్లేదన్నట్టుగా నిర్బంధించారు.