రౌడీషీటర్ కొడుకుని అభ్యర్థిగా నిలిపింది కాంగ్రెస్. బీఆర్ఎస్ కార్యకర్తలకు బెదిరింపులు కొనసాగుతున్నయ్. ప్రచారం నిర్వహిస్తున్న వారిపై దాడులు జరుగుతున్నయ్. తానేమీ తక్కువ తినలేదన్నట్టు ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రే బెదిరింపులకు దిగారు. సంక్షేమ పథకాలను రద్దు చేస్తానని ప్రజలను బెదిరిస్తున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ‘బీఆర్ఎస్సోడికి ఓటేసిర్రంటే.. మీ పిల్లలకు పెడుతున్న సన్నబియ్యం బువ్వ రద్దు చేస్తం’ అని ముఖ్యమంత్రి హోదాలో జూబ్లీహిల్స్ ఓటర్లను రేవంత్‌రెడ్డి బహిరంగంగా బ్లాక్మెయిల్ చేశారు. శుక్రవారం రహమత్‌నగర్‌లో రోడ్‌షో నిర్వహించిన రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్కు ఓటు వేస్తే స్కీములను రద్దు చేస్తామని బహిరంగంగా హెచ్చరించారు. ఈ రెండేండ్లలో తాను చేసిన మంచి పనుల గురించి చెప్పుకోకుండా ఇచ్చిన రేషన్‌కార్డులు, వాటి ద్వారా పొందే సన్నబియ్యం, ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత ప్రయాణం వంటి పథకాల రద్దు గురించి మాట్లాడారు. రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ ‘ఇయ్యాల బీఆర్ఎస్సోడికి ఓటేసిర్రంటే.. మీ పిల్లలకు పెడుతున్న సన్నబియ్యం బువ్వ రద్దయితది. ఇయ్యాల బీఆర్ఎస్సోడు వస్తే.. పేదోళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంటు రద్దయితది. ఇక్కడ 25 వేల మందికి ఇచ్చిన రేషన్‌కార్డులు రద్దయిపోతయ్. ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం రద్దయిపోతుంది’ అంటూ బహిరంగ హెచ్చరికలు చేశారు. రోడ్‌షోలో సీఎం ప్రసంగం వింటున్న జూబ్లీహిల్స్ ఓటర్లు నివ్వెరపోయారు. ‘ఒక్క ఎమ్మెల్యే సీటు ఓడిపోతే.. ఇవ్వన్నీ రద్దు చేస్తరా?’ అంటూ విస్తుపోయారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
‘ముఖ్యమంత్రి ఇంత బహిరంగంగా బెదిరిస్తారా?’ అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదే విషయంపై బీఆర్ఎస్ నేత వై సతీశ్‌రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ప్రజలను బెదిరిస్తున్న ముఖ్యమంత్రి.. కేవలం జూబ్లీహిల్స్ ప్రజలకే రద్దయితయా? లేక తెలంగాణలో అందరికీ రద్దయితయా? ఏ సీఎం అయినా చేసిన మంచి చెప్పి, ఇంకా ఏం చేస్తారో చెప్పి ఓటు అడగాలి కాని.. ఉన్నయి రద్దు చేస్తామని బెదిరిస్తూ ఓటు అడిగే సీఎంను ఇప్పుడే చూస్తున్నం. ఒకపక్క ప్రతిపక్ష నాయకులను కాంగ్రెస్ అభ్యర్థి బెదిరిస్తుంటే.. ముఖ్యమంత్రి ఏకంగా ప్రజలనే బెదిరిస్తున్నడు’ అంటూ సతీశ్‌రెడ్డి తన అభిప్రాయం వ్యక్తంచేశారు.
సీఎం రోడ్‌షోకు నిరసన సెగ
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో శుక్రవారం రేవంత్‌రెడ్డి నిర్వహించిన రోడ్‌షోకు నిరసన సెగ తగిలింది. వెంగళ్రావునగర్ కృష్ణకాంత్ పార్క్ వద్ద నిర్వహించిన సీఎం సభలో ఆమ్ఆద్మీ పార్టీ మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ప్రతినెలా రూ.2500 ఇవ్వాలని, విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలని, చిత్రపురి కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆమ్ ఆద్మీ మహిళా కార్యకర్తల నిరసనతో కాంగ్రెస్ నాయకులు కంగుతిన్నారు. అక్కడే ఉన్న పోలీసులు ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా కార్యకర్తలను ఈడ్చి పడేశారు. వారితో దురుసుగా ప్రవర్తించారు. బలవంతంగా పోలీస్ వాహనంలో ఎక్కించి మధురానగర్ పోలీస్స్టేష్కు తరలించారు. హామీలు నెరవేర్చాలని అడిగిన తమ గొంతునొక్కడం దౌర్భాగ్యమని ఆప్ నాయకురాలు హేమ మండిపడ్డారు. ప్రశ్నించడమే తాము చేసిన తప్పా అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వం అంటే మహిళలను అవమానించడం..అగౌరవపరచడమేనా? అని నిలదీశారు.