హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, దమ్ముంటే ఉపఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన 20 నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిన మంచిని చూపించి, ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఓటమి భయం పట్టుకున్నదని వ్యాఖ్యానించారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధ్యక్షతన ఆదివారం జరిగిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విసృ్తతస్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. నాయకులు మోసం చేసినా, కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారని కేటీఆర్ ప్రశంసించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేండ్లలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయిందని కేటీఆర్ వివరించారు. 2014లో గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్కు ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేవారని గుర్తుచేశారు. కేసీఆర్ సీఎం అయిన ఆరు నెలల్లోనే తీవ్రంగా ఉన్న విద్యుత్తు సమస్యను పూర్తిగా పరిషరించారని చెప్పారు. హైదరాబాద్‌ను కులం, మతం, ప్రాంతం పేరుతో రాజకీయాలు చేయకుండా, అన్నదమ్ములుగా ఏ పంచాయితీ లేకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపించామని వివరించారు. తెలంగాణకు గుండెకాయగా హైదరాబాద్‌ను కేసీఆర్ మార్చారని, అందుకే 2023 ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే సీటు కూడా కాంగ్రెస్‌కు రాకుండా, మొత్తం గులాబీ జెండాకే నగర ప్రజలు ఓట్లేశారని చెప్పారు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో నాయకులు ఎన్నడూ రియల్ఎస్టేట్లో వేలు పెట్టలేదని, కబ్జాలు, గూండాగిరి చేయలేదని కేటీఆర్ స్పష్టంచేశారు. కానీ, 20 నెలల్లోనే హైడ్రా పేరుతో కాంగ్రెస్ నాయకులు అరాచకం సృష్టించారని దుయ్యబట్టారు. కోర్టు ఆర్డర్ ఉన్నా పట్టించుకోకుండా పేదల ఇండ్లు కూల్చివేశారని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో రెండు లక్షల 85 వేల కోట్ల అప్పు చేస్తే, రేవంత్‌రెడ్డి 20 నెలల్లోనే రూ.రెండు లక్షల 20 వేల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. కేసీఆర్ ఆ అప్పుతో హైదరాబాద్‌లో 42 ఫె్లైఓవర్లు, అత్యాధునిక దవాఖానలు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు కట్టారని, కానీ రేవంత్ ఒక కొత్త బ్రిడ్జి కానీ, మోరీ కానీ కట్టిండా? అని ప్రశ్నించారు. కేసీఆర్ 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.70 వేల కోట్లు వేస్తే, రూ.రెండు లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ ఏం చేశారని నిలదీశారు. రూ.200 ఉన్న పెన్షన్‌ను కేసీఆర్ ప్రభుత్వం రూ.2 వేలు చేస్తే, రేవంత్ ఏం చేశారని ప్రశ్నించారు.
శేరిలింగంపల్లితోపాటు పార్టీ మారిన మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రజల కోసం కాకుండా, తమ సొంత లాభం కోసమే కాంగ్రెస్‌లోకి వెళ్లారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ప్రజలకు మంచి చేసి ఉంటే, ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. హైదరాబాద్ మహానగరానికి రేవంత్‌రెడ్డి చేసింది ఏమీలేదని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యే గాంధీ కాంగ్రెస్‌లో చేరారని విమర్శించారు. ఆయన పార్టీ మారినంత మాత్రాన కార్యకర్తలు బాధపడాల్సిన పనిలేదని, నియోజకవర్గ పార్టీ శ్రేణులకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మేడ్చల్ అధ్యక్షుడు శంభీపూర్ రాజు, గెల్లు శ్రీనివాస్, కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లు కొమిరిశెట్టి సాయిబాబా, మాధవరం రంగారావు, ఎర్రబెల్లి సతీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకుల బ్లాక్మెయిల్ దందాల కోసమే హైడ్రా పనిచేస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో సీఎం రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి అక్రమంగా కట్టిన ఇంటిని కూల్చే ద మ్ము హైడ్రాకు ఉన్నదా? అని ప్రశ్నించారు. పేదల ఇండ్లు కూలగొడుతున్న హైడ్రా, పెద్దల జోలికి మాత్రం వెళ్లడం లేదని మండిపడ్డారు. హైడ్రా అరాచకాలతోనే హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ రంగం పూర్తిగా కుప్పకూలిందని, నగర వృద్ధి అతలాకుతలమైందని విమర్శించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో చేసిన అప్పుల కంటే ఎకువ అప్పులను కేవలం 20 నెలల్లోనే చేసిన రేవంత్‌రెడ్డికి, తాను చేసిన అభివృద్ధిని చెప్పుకునే దమ్ము ఉన్నదా? అని నిలదీశారు.