Telangana | రాజకీయ విలువలు ఉంటే కాంగ్రెస్‌లో చేరిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు. పోచారంపై తానే పోటీ చేస్తానని ప్రకటించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాజిరెడ్డి మాట్లాడుతూ.. పార్టీ మారడానికి పోచారం చెబుతున్న కారణాలు చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు.
రేవంత్ రెడ్డి వ్యవసాయానికి చేస్తున్న మేలును దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు పోచారం చెప్పడం ఆత్మవంచనేనని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రైతులకు ద్రోహం చేస్తున్న రేవంత్ రెడ్డి తీరును సీనియర్ నాయకుడు పోచారం ఎందుకు మరిచిపోయారో అర్థంకావడం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బాన్సువాడ ప్రచారంలో రేవంత్ పోచారం కుటుంబాన్ని దండుపాళ్యం బ్యాచ్‌తో పోల్చారని.. అలాంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పార్టీ మారడం నిజంగా ఆశ్చర్యంగా ఉందన్నారు.
దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని బాజిరెడ్డి గోవర్ధన్ సవాలు విసిరారు. బీఆర్ఎస్ నుంచి తానే బరిలోకి దిగుతానని ప్రకటించారు. గతంలో తనపై పోచారం ఒకసారి గెలిచారని, ఒకసారి తానే పోచారాన్ని ఓడించానని చెప్పారు. తాము ఇద్దరం సమఉజ్జీలమని తెలిపారు. కేసీఆర్ పోచారానికి స్పీకర్ పదవి, లక్ష్మీపుత్రుడు బిరుదు ఇచ్చారని, వ్యవసాయ మంత్రిగా పోచారానికి కేసీఆర్ మంచి అవకాశం ఇచ్చారని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఈ వృద్ధాప్యంలో కృష్ణా రామ అంటూ ఉండక పోచారం ఇలాంటి నిర్ణయం తీసుకుని ఏం సాధిస్తారంటూ ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయం ద్వారా భావి తరాలకు ఏం సందేశం ఇస్తున్నారంటూ బాజిరెడ్డి నిలదీశారు. స్వార్థం కోసమే పోచారం నిర్ణయం తీసుకున్నారని, కేసీఆర్ ఏం తకువ చేశారని ఈ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. పోచారం పార్టీ మారడం వల్ల బీఆర్ఎస్కు వచ్చిన నష్టమేమి లేదని, కాంగ్రెస్‌కు వచ్చే లాభం కూడా ఉండదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పోచారం రాకను జీర్ణించుకోవడం లేదన్నారు.