కరీంనగర్ కార్పొరేషన్, మే 28 : గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకుడు నర్సింగరావు ఫోన్ ట్యాప్ చేసి ఉంటే బీఆర్ఎస్ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో గెలిచి, అధికారంలోకి వచ్చేదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. కోరుట్లలో ఐదుసార్లు పోటీ చేసి ఓడిపోయిన నర్సింగరావు ఏదో పెద్ద నాయకుడిని అనుకొని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
మంగళవారం కరీంనగర్‌లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ గాలి వీచిన 2009 ఎన్నికల్లోనూ నర్సింగరావు 17 వేల ఓట్లతో ఓడిపోయారని, తర్వాత ఎన్నికల్లో 70 వేల ఓట్లతో, 2014లో 22 వేల ఓట్లతో, 2018లో 32 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారని గుర్తుచేశారు. 2023 ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా రాలేదని విమర్శించారు. కనీసం రెండో స్థానం కూడా రాలేదని, అలాంటి వ్యక్తి ఫోన్ ఎందుకు ట్యాప్ చేస్తారని ప్రశ్నించారు.
ఐదుసార్లు పోటీ చేసినా ప్రజలు కనీసం ఆయన్ను గుర్తించలేదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో మొన్నటి వరకు ఆయనకు ఎలక్షన్ రాజా అని పేరు ఉందని, ఇప్పుడు అది కలెక్షన్ రాజాగా మారిందని ఆరోపించారు. నియోజకవర్గంలో రైస్‌మిల్లర్స్, ఇతరులను బెదిరించి వసూళ్లు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 60 ఏండ్ల దరిద్రాన్ని కేసీఆర్ పదేండ్లలోనే తొలగించారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దరిద్రాన్ని మళ్లీ తీసుకువచ్చిందని, పూర్తిగా విధ్వంసం చేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ ఆరు నెలల పాలనలోనే కుంభకోణాలు బయటకు వస్తున్నాయని తెలిపారు. పరిశ్రమలు కూడా రాష్ర్టాన్ని వీడిపోతున్నాయని అన్నారు. మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకూ పనికిరాదంటూ హంగామా చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మేడిగడ్డ వద్ద మరమ్మతు పనులు ప్రారంభించారని పేర్కొన్నారు.