నిజామాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సన్నరకం వడ్లపై రైస్ మిల్లర్ల దోపిడీని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేదిలేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతుల నుంచి మిల్లర్లు మద్దతు ధర కన్నా తక్కువ చెల్లించి సన్నరకం వడ్లను కొనుగోలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల సంస్థ హెచ్చరించింది. మిల్లర్ల దోపిడీపై నమస్తే తెలంగాణ ప్రధాన సంచికలో ‘సన్నధాన్యం దళారుల పాలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పందించింది. నిజామాబాద్ జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ జగదీశ్ ద్వారా వివరణను విడుదల చేసింది. బహిరంగ మార్కెట్లో క్వింటాల్ సన్నరకం వడ్లకు రూ.2300 నుంచి రూ.2600 వరకు డిమాండ్ ఉన్నట్టు అధికారులు అంగీకరించారు. ఎవరైనా మధ్యవర్తులు, రైస్ మిల్లర్లు రైతులను మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రైతులు పండించిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకోకుండా ఎలాంటి షరతులు, ఆంక్షలు లేవని పౌరసరఫరాల సంస్థ పేర్కొన్నది. రైస్ మిల్లర్లు ప్రభుత్వ ఉద్దేశాన్ని దెబ్బతీస్తూ ఇష్టారీతిన కొనుగోళ్లకు పాల్పడితే పౌరసరఫరాల సంస్థకు ఫిర్యాదు చేయాలని రైతులకు అధికారులు సూచించారు.