అభిమన్యుడు హరీశ్ సాగునీటిపైనా, కాళేశ్వరంపైనా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను అసెంబ్లీలో హరీశ్‌రావు అభిమన్యుడిలా ఎదుర్కొన్నారు. సభలో సీఎం, మంత్రుల తప్పుడు మాటలను దీటుగా తిప్పికొట్టారు. అన్నీ తానై వారిని ఎదుర్కొన్నారు.
–కేటీఆర్
కాంగ్రెస్ హయాంలో కట్టిన కడెంప్రాజెక్టు రెండుసార్లు, గుండ్లవాగు రెండుసార్లు కొట్టుకుపోయింది. సాగర్‌లో, శ్రీశైలంలో లీకేజీలు వచ్చాయి. అయినా మేమెప్పుడూ రాజకీయం చేయలేదు, రాజకీయాలు మాట్లాడలేదు.
-కేటీఆర్
KTR | వరంగల్, మార్చి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జయశంకర్ భూపాలపల్లి, హైదరాబాద్(నమస్తే తెలంగాణ): “మీ పగ ప్రతీకారాలు మామీదేగా.. మరి రైతులనెందుకు ఇబ్బందిపెడతారు. దయచేసి వారిని వదిలేయండి. రాష్ట్రంపై పగబట్టకండి.. మీ కోపాన్ని మాపై తీర్చుకోండి.. ఇబ్బందేమీ లేదు” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్‌కు హితవు పలికారు. ఇప్పటికైనా రాజకీయం బంద్‌చేసి రైతులకు నీళ్లివ్వాలని కోరారు. కాళేశ్వరప్రాజెక్టు యాత్రలో భాగంగా బీఆర్ఎస్ బృందం శుక్రవారం మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లను సందర్శించింది. అనంతరం అన్నారం వద్ద ఏర్పాటు చేసిన వేదికపైనా, యాత్ర ప్రారంభానికి ముందు తెలంగాణ భవన్‌లోనూ కేటీఆర్ మాట్లాడారు. మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా వర్షకాలం వరకు వదిలేసి వరదకు బరాజ్ కొట్టుకుపోవాలని కాంగ్రెస్ చూస్తున్నదని ఆరోపించారు. మేడిగడ్డలో కుంగిన పిల్లర్లను మాత్రమే చూపిస్తూ ప్రాజెక్టు మొత్తాన్నే బద్నాం చేస్తున్నదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోయేలా చేసి తెలంగాణను మళ్లీ ఎడారి చేయాలని చూస్తున్నదని ఆరోపించారు. పునరుద్ధరణ పనులు చేపట్టకపోవడం అందులో భాగమేనని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌కు రైతు ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా మారాయని కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రాజెక్టుపై విషయంలో ఎలాంటి విచారణనైనా చేసుకోవచ్చని, అవినీతి జరిగిందని తేలితే బాధ్యులపై కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. అంతే తప్ప ప్రాజెక్టును మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని కోరారు. ఇప్పటికే పంటలు ఎండుతున్నాయని, ఇకనైనా మొండిపట్టుదల వీడి బరాజ్ పునరుద్ధరణ పనులు చేయపట్టాలని డిమాండ్ చేశారు. మున్ముందు కాళేశ్వరంలో భాగమైన అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, పంప్‌హౌజ్‌లను, ఎండుతున్న పంటలను సందర్శిస్తామని తెలిపారు.
కామధేనువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టి, వాస్తవాలను ప్రజల ముందు పెట్టేందుకే ప్రాజెక్టును సందర్శించినట్టు కేటీఆర్ తెలిపారు. మేడిగడ్డకు వెళ్తామని నల్లగొండ అధినేత కేసీఆర్ చేసిన ప్రకటన ప్రకారం మేడిగడ్డను సందర్శించామని, ఇది మొదటి అడుగు మాత్రమేనని పేర్కొన్నారు. ప్రపంచంలోనే కాళేశ్వరం అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని పేర్కొన్న కేటీఆర్.. మేడిగడ్డ బరాజ్‌లోని 85 పిల్లర్లలో 3 పిల్లర్లుకు సమస్య వస్తే మొత్తం కాళేశ్వరమే వృథా అయిందని, లక్షకోట్లు బూడిదలో పోశారంటూ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరమ్మతులను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నదని ఆరోపించారు. తమతో పాటు ఇంజినీర్లు వెంకటేశం, దామోదర్‌రెడ్డి అందరూ వచ్చారని, బ్యారేజీలను చూశారని చెప్పారు.