Telangana | జగిత్యాల మల్యాల డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ): అనారోగ్యంతో దవాఖానలో చేరితే పేదల పాలిట పెన్నిధిగా నిలిచే ఆరోగ్యశ్రీ పథకం కాంగ్రెస్ పాలనలో పరిహాసానికి గురవుతున్నది. సాంకేతిక కారణాలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణకు జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన పొన్నం లింగయ్యకు కిడ్నీ చెడిపోయిందని వైద్యులు తెలిపారు. వీలైనంత త్వరగా రెండు ఆపరేషన్లు చేయాలని అన్నారు. లింగయ్య కుటుంబానికి ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. కానీ ఆహారభద్రత కార్డులో పేరు నమోదుకాలేదు.
హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు వెళ్లి అనుమతి తెచ్చుకోవాలని వైద్యులు సూచించారు. లింగయ్య భార్య, పిల్లలు ప్రజాభవన్‌కు వెళ్లి అధికారులను వేడుకున్నారు. రోగి వస్తేనే లెటర్ ఇస్తామని అధికారులు తేల్చిచెప్పారు. రోగి రాలేని పరిస్థితిలో ఉన్నాడని చెప్పినా ఒప్పుకోలేదు. రోగి ఏమైనా వెంటిలేషన్ మీద చికిత్స తీసుకుంటున్నాడా అంటూ జాలి లేకుండా మాట్లాడారు. గత్యంతరం లింగయ్యను కూడా వెంటబెట్టుకున్నారు. లింగయ్య ఒక్కరే కాదు నిత్యం చాలామంది రోగులు ప్రజాభవన్‌లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు.
అసలేమైందంటే..! మల్యాలకు చెందిన పొన్నం లింగయ్యకు భార్య లత, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. 2005లో బతుకుదెరువు కోసం దుబాయ్ బాట పట్టాడు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాంలో రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేశారు. 2012లో కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఫ్యామిలీ కార్డులు ఇచ్చి, ఆరోగ్యశ్రీకి అనుసంధానం చేశారు. 2016లో ఇంటికి వచ్చిన లింగయ్య గుండెపోటుకు గురయ్యాడు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో ఆరోగ్యశ్రీ కార్డుతో ఆపరేషన్ చేయించుకున్నాడు.
ఆ తర్వాత మళ్లీ దుబాయికి వెళ్లాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 30న లింగయ్య ఇంటికి వచ్చాడు. అనారోగ్యంతో దవాఖానకు వెళ్లగా, కిడ్నీ పూర్తిగా చెడిపోయిందని వైద్యులు స్పష్టంచేశారు. కానీ ఆహారభద్రత కార్డులో పేరు లేనందున, ఉచిత చికిత్స సాధ్యం కాదని చెప్పారు. లింగయ్యతో పాటు కుటుంబ సభ్యులంతా అవస్థలు పడుతూ ప్రజాభవన్‌కు వెళ్లి లెటర్ తీసుకున్నారు. లింగయ్య నవంబర్ 13న దవాఖానలో చేరగా వైద్యులు ఆపరేషన్ చేశారు. ఎనిమిదేండ్ల క్రితం గుండె ఆపరేషన్ సమయంలో ఇంత పరేషాన్ కాలేదని లింగయ్య గుర్తుచేసుకుంటున్నాడు.
ఆహార భద్రత కార్డుల జారీ తర్వాత పుట్టిన పిల్లలకు, కార్డుల జారీ సమయంలో విదేశాల్లో ఉండి బయోమెట్రిక్ ద్వారా వివరాలు నమోదు కాని వాళ్లకు ఆరోగ్యశ్రీ వర్తింపులో సమస్యలు వస్తున్నాయి. అత్యవసర సమయాల్లో కలెక్టర్లు అనుమతి ఇచ్చే లా ప్రభుత్వం నిబంధనలు మార్చాలని రోగులు కోరుతున్నారు. లేదంటే ఆపదలో పేదల ప్రాణాలమీదకు వస్తుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.