Indiramma Illu | హైదరాబాద్, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో ఇంటి జాగా ఉన్నవారు ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని గృహనిర్మాణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆర్థిక స్థితిగతులు, ప్రభుత్వం పేర్కొన్న నియమ నిబంధనలకు లోబడి అర్హుల ఎంపిక జరుగుతుందని వారు పేర్కొన్నారు.
జాగా ఉండి ఇల్లు లేనివారు, కచ్చా ఇళ్లలో నివసిస్తున్నవారికి మొదటి దశలో ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విధితమే. పట్టణ ప్రాంతాల్లో చాలామంది పేద, మధ్యతరగతి ప్రజలు శివారు ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేసుకొని ఇల్లు నిర్మించుకునే స్థోమత లేకపోవడంతో అద్దె ఇళ్లలోనే కాలం వెళ్లదీస్తున్నారు. పట్టణ పేదల కోసం ప్రభుత్వం ఇంతవరకు సరైన మార్గదర్శకాలు విడుదల చేయలేదు. దీంతో ఇప్పటివరకు సిటీలో ప్లాట్లు ఉన్నవారు ఇంటికి దరఖాస్తు చేసుకోవాలా, చేసుకోవద్దా? అనే సంశయంలో ఉన్నారు. ఈ విషయమై కొంత స్పష్టత వచ్చింది. జాగా లేనివారు, మురికివాడల్లోని ప్రభుత్వ స్థలాలు, ప్రైవేటు ఖాళీ జాగాల్లో గుడిసెలు వేసుకొని జీవిస్తున్నవారికి మొదటి దశలో ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యే అవకాశం లేదు. ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాతే వీరికి ఇల్లు మంజూరుపై స్పష్టత వస్తుంది.
ప్లాట్లు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు
‘నగరాలు, పట్టణాలే కాదు, ఎక్కడ ఇంటి జాగా ఉన్నా ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నియమ, నిబంధనలకు అనుగుణంగా అర్హుల ఎంపిక జరుగుతుంది. ప్లాటు ఎంత విస్తీర్ణంలో ఉన్నప్పటికీ నిర్ణీత వైశాల్యానికి తగ్గకుండా ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇల్లు మంజూరైతే ప్రభుత్వం దశలవారీగా రూ.5 లక్షలు అందిస్తుంది. జాగా లేనివారికి మొదటి విడతలో ఇల్లు మంజూరయ్యే అవకాశం లేదు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’ అని గృహనిర్మాణ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.