Funky Trailer | మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ ‘ఫంకీ’ విడుదలకు సిద్ధమవుతోంది. ‘జాతిరత్నాలు’ ఫేమ్ దర్శకుడు అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 13న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన రావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకుల్లో నవ్వుల జల్లు కురిపిస్తోంది.
ట్రైలర్ చూస్తే అనుదీప్ స్టైల్ కామెడీ ఎలిమెంట్స్ ఈ సినిమాలో కూడా పుష్కలంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. లాజిక్స్‌ను పక్కనపెట్టి కేవలం వినోదానికే ప్రాధాన్యం ఇచ్చినట్లు ట్రైలర్ కట్ కనిపిస్తోంది. ఇందులో విశ్వక్ సేన్ ఓ డైరెక్టర్ పాత్రలో కనిపించగా, కయాదు లోహర్ ప్రొడ్యూసర్‌గా కనిపించడం ఆసక్తికరంగా మారింది. వీరిద్దరి మధ్య సాగే ప్రేమ కథతో పాటు చుట్టూ తిరిగే కామెడీ సన్నివేశాలు ట్రైలర్ హైలైట్‌గా నిలిచాయి. అనుదీప్‌కు ప్రత్యేకమైన పంచ్ డైలాగ్స్, విశ్వక్ సేన్ కామెడీ టైమింగ్ కలిసి ట్రైలర్‌కు మంచి హ్యూమర్ టచ్ ఇచ్చాయి.
గత కొంతకాలంగా వరుస ఫ్లాప్స్‌తో ఇబ్బందులు పడుతున్న విశ్వక్ సేన్‌కు ఈ సినిమా ఎంతో కీలకంగా మారింది. అందుకే ‘ఫంకీ’పై ఆయన భారీ ఆశలు పెట్టుకున్నారు. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విశ్వక్‌కు సక్సెస్ తెస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే లక్ష్యంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్‌కు వచ్చిన స్పందన చూస్తుంటే, ఫిబ్రవరి 13న ‘ఫంకీ’ థియేటర్లలో నవ్వుల పండుగ తీసుకురానుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.