మెదక్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : భారీ వర్షాలు, వరదలతో సగం తెలంగాణ ఆగమాగమవుతుంటే రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చొని నిన్న మూసీ సుందరీకరణ, నేడు స్పోర్ట్స్ మీద రివ్యూ నిర్వహిస్తున్నాడే తప్ప ప్రజల ప్రాణాల గురించి పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రెండు రోజులుగా మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గురువారం మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం రాజిపేటలో వరదల్లో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిలతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ మెదక్-కామారెడ్డి జిలాల ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతుంటే రేవంత్ మూసీ సుందరీకరణ, ఆటల పోటీల అంశంపై రివ్యూ చేయడం ఏంటని మండిపడ్డారు.
రాజిపేటకు చెందిన యాదాగౌడ్, సత్యనారాయణ వరదల్లో చిక్కుకొని మృతిచెందారని, మెదక్‌లోని ఓ హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థుల కోసం వీరిద్దరు ఆటోలో వెళ్తున్న క్రమంలో వరదలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. స్తంభంపైకి చేరుకుని నాలుగైదు గంటల పాటు కాపాడాలని కోరినా రక్షించలేదని, సకాలంలో హెలికాప్టర్ పంపితే రెండు ప్రాణాలు దక్కేవని అన్నారు. అత్యవసరమైతే తప్ప హెలికాప్టర్ వాడలేమని ఒక మంత్రి అన్నారని, పెళ్లిళ్లకు, సీఎం కోసం, ఇతర పనులకు వాడవచ్చు కానీ ప్రజల ప్రాణాల రక్షించేందుకు హెలికాప్టర్ పంపరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే వారిద్దరు ప్రాణాలు కోల్పోయారని, ఆ రెండు కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని, నష్టపోయిన పంట పొలాలకు ఎకరానికి రూ. 25వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
మెదక్ జిల్లా అతలాకుతలం అవుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మెదక్ జిల్లాలో ముంపు ప్రాంతాల ప్రజలు సహాయక చర్యల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. తాగునీరు లేకపోవడం తో వర్షం నీరు తాగుతున్నారని, ఇంత దౌర్భగ్యమైన పరిస్థితి ఎప్పుడూ రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతిపక్ష నాయకులు పట్టిలేపితే తప్ప ప్రభుత్వం మేల్కొనలేదని ధ్వజమెత్తారు. నిన్నటి నుంచి దూప్‌సింగ్ తండా వాసులు నీటిలో ఉన్నా సర్కార్ పట్టించుకోలేదని మండిపడ్డారు. వరదల్లో కొట్టుకుపోయినా సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని హరీశ్‌రావు విమర్శించారు.