మెదక్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ )/జిన్నారం: ‘రేవంత్‌రెడ్డీ.. నువ్వు ముఖ్యమంత్రివా..? లేక వీధిరౌడీవా..? అవ్వాతాతలకు రూ.4వేల పింఛన్ ఎప్పుడిస్తావని అడిగితే లాగుల్ల తొండలు వదులుతా అంటవా? ఆడబిడ్డలు మహాలక్ష్మి రూ.2,500 అడిగితే పేగులు తీసి మెడలో వేసుకుంటా అంటావా? నీ రౌడీయిజం సాగదు.. ఖబడ్దార్.. 11వ తేదీలోగా రైతుబంధు ఇవ్వకపోతే రైతులు నీ చెడ్డీల తొండలు ఇడుస్తరు.. నిన్ను చీరి చింత కడతారు’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నా బడ్జెట్లో రాష్ర్టానికి గుండు సున్నా ఇచ్చారని, కేంద్ర బడ్జెట్లో మొండిచేయి చూపారని మండిపడ్డారు.
బుధవారం ఆయన మెదక్ జిల్లా నర్సాపూర్, మెదక్, రామాయంపేట, సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ పేరుతో అధిక నిధులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఏపీకి నిధులు ఇవ్వడంపై అభ్యంతరం లేదని, కానీ, కేంద్ర బడ్జెట్లో తెలంగాణను విస్మరించడం తగదని చెప్పారు. బీజేపీ ఎంపీలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి మోసం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని.. వారి విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు రూపాయి ఇవ్వని బీజేపీకి మనమెందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు.
మెదక్‌లో మల్కాజిగిరి రౌడీలు
‘పదవులు గడ్డిపోచల్లా విసిరేసిన మహానేత కేసీఆర్. పీసీసీ పదవిని రూ.50 కోట్లకు కొన్న చరిత్ర నీది. తెలంగాణ కోసం పదవులే కాదు… ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడ నాయకుడు కేసీఆర్’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్ తెచ్చిన తెలంగాణ లేకపోతే ఆంధ్రా మోచితి నీళ్లు తాగేవవాడివని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలిచే దమ్ములేక, ఓడిపోతామనే భయంతో ప్రలోభపెట్టి తమ అభ్యర్థులను ఎత్తుకెళ్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి అమెరికా వెళ్తే రాష్ట్రంలో శబ్దకాలుష్యం తగ్గిందని, రాగానే మళ్లీ మెదలైందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అవినీతి సొమ్మును ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు వస్తున్నారని, ఆ డబ్బులు తీసుకొని బీఆర్ఎస్కు ఓట్లు వేయాలని చెప్పారు.
కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు ప్రజలు భయపడే పరిస్థితి లేదని పేర్కొన్నారు. మల్కాజిగిరికి చెందిన రౌడీలు మెదక్‌లో దిగి బీఆర్ఎస్ నాయకులను బెదిరింపులకు గురిచేస్తున్నారని, ఇక్కడ మీ రౌడీయిజం నడువదని హెచ్చరించారు. మెదక్‌ను అన్ని రంగాల్లో కేసీఆర్ అభివృద్ధి చేశారని వివరించారు. సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుసేన్, బీఆర్ఎస్ నాయకులు దేవేందర్‌రెడ్డి, మల్లికార్జున్ గౌడ్, చంద్రగౌడ్ పాల్గొన్నారు.