ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఆ ప్రజాప్రతినిధి కంట పడితే ఎలాంటి భూములైనా ఖతం కావాల్సిందే. సెటిల్మెంట్లలో ఆరితేరిన ఆయన దందాల స్టయిలే వేరు. బెదిరించడం, భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకోవడం ఆ లీడర్ నైజం. తొలిసారి చట్టసభలోఅడుగుపెట్టిన సదరు నాయకుడు అనతికాలంలోనే భూ దందాలకు తెరలేపారు. అడ్డగోలుగా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా భూబకాసురుడి అవతారమెత్తారు. తాజాగా న్యాయం చేయాలని ఆయన దగ్గరికెళ్లి ఓ బాధితుడు వేడుకోగా.. ఆ కేసులో ఆయన ఏకంగా పదెకరాలు అక్రమంగా లాక్కోవడం కొసమెరుపు.
యాదాద్రి భువనగిరి, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్న ఆ ప్రజాప్రతినిధి భూసెటిల్మెంట్లలో రారాజుగా నిలుస్తున్నారు. బీసీ నేతగా చెప్పుకొనే ఆయన తొలుత సావధానంగా చెప్తారని, వినకుంటే తన ప్రతాపం చూపిస్తారనే ప్రచారముంది. వందల కోట్ల సంపాదనే లక్ష్యంగా దందాలు, సెటిల్మెంట్లు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. బొమ్మలరామారం-కొండమడుగు మధ్యలో ఓ మార్వాడీకి చెందిన 250 ఎకరాల భూమిని సెటిల్ చేసినట్టు ప్రచారం ఉన్నది. యాదగిరిగుట్ట మండలంలోని ఓ గ్రామంలో రెండెకరాలు అక్రమంగా విక్రయించినట్టు తెలిసింది. ఇలా అనేక విషయాల్లో తలదూర్చి సెటిల్మెంట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆలేరు మండలంలోని కొలనుపాకలో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. వ్యాపారంలో భాగంగా కొలనుపాకలోనే సర్వే నంబర్ 472, 473లో 40 ఎకరాల్లో అగరు వనం పేరుతో వ్యవసాయం చేస్తున్నారు. ఇందులో పెట్టుబడి కోసం ఓ మార్వాడీ వద్ద సుమారు రూ.4 కోట్ల వరకు వడ్డీకి తెచ్చి ఆ భూములను అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. అయితే రియల్ ఎస్టేట్ లేకపోవడం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావడంతో డబ్బులు తిరిగి చెల్లించలేదు. ఈ నేపథ్యంలో మార్వాడీతో మాట్లాడి తనకు రావాల్సిన వాటాను ఇప్పించాలని సదరు ప్రజాప్రతినిధికి మొర పెట్టుకున్నారు. దీంతో ఇదే అదనుగా భావించిన నేత రంగంలోకి దిగారు. రియల్ ఎస్టేట్ వ్యాపారికి న్యాయం చేయకపోగా మార్వాడీని పిలిపించి తన ప్రతాపం చూపించారు. 40 ఎకరాల్లో 10 ఎకరాలు తనకు ఇవ్వాలని హుకూం జారీచేశారు.
మొత్తం భూమిలో 10 ఎకరాలు ఇవ్వాలని ఆదేశించడంతో మార్వాడీకి భూములు ఇవ్వక తప్పలేదు. సదరు మార్వాడీ డిసెంబర్లో ఆలేరు తాసీల్దార్ కార్యాలయంలో తన భూమిని సేల్ కమ్ జీపీఏ నుంచి సేల్ డీడ్‌గా మార్చుకున్నారు. ఆ ప్రజాప్రతినిధి 10 ఎకరాల సెటిల్మెంట్లో భాగంగా తొలుత ఎకరం భూమిని హడావుడిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. డిసెంబర్ మూడో వారంలో సదరు నేతకు చెందిన 40 అనుచరులకు ఒక్కొక్కరికి ఒక్కో గుంట చొప్పున రిజిస్ట్రేషన్ చేయించినట్టు తెలిసింది. ఆయన అనుచరులు మాత్రం తాము డబ్బులు పెట్టి కొనుగోలు చేశామని బయట చెబుతూ సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అగరు వనం విషయంలో పోలీసులు కూడా తలదూర్చినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ కీలక ప్రజాప్రతినిధి పోలీసులను రంగలోకి దింపి.. బాధితులను నయానోభయానో తమ దారిలోకి తెచ్చుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.