సూర్యాపేట, జూలై 16 (నమస్తే తెలంగాణ) : ‘గతంలో చాలాసార్లు చెప్పిన… ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన సందర్భంగా ఉద్ఘాటించిన, ఇప్పుడు మళ్లీ చెప్తున్న.. నీళ్లు ఎలా ఇవ్వాలో కేసీఆర్‌ను అడిగి తెలుసుకో.. లేదంటే ప్రాజెక్టును కేసీఆర్‌కు అప్పగించు.. మూడంటే మూడు రోజుల్లో జలాలు రైతుల పొలాల్లోకి పారుతాయి’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీలు కూడబలుక్కొని చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మన్నెం సదాశివరెడ్డి ఫంక్షన్‌హాలులో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని బరాజ్‌లు, రిజర్వాయర్ల వీడియోలతో సహా చూపిస్తూ ‘కాళేశ్వరం-వాస్తవాలు’ అనే అంశంతో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, నాయకులతోపాటు సూర్యాపేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పదేపదే సూర్యాపేటకు కాళేశ్వరం జలాలు రాలేదంటున్నారని దమ్ముంటే చివరి ఆయకట్టు గ్రామమైన పెన్‌పహాడ్ మండలం చినసీతారం తండాకు వస్తే నీళ్లు వచ్చాయో రాలేదో తెలుస్తుందని అన్నా రు. ‘నీళ్లు రాలేదంటే నేను ఉరి వేసుకోవడానికైనా.. చెప్పు దెబ్బలకైనా సిద్ధం.. లేదంటే అదే తండాకు చెందిన గిరిజన రైతుల తో చెప్పుదెబ్బలు తినాలి’ అని ముఖ్యమంత్రి, మంత్రులకు సవాల్ విసిరారు.
కాళేశ్వరం అంటే ఒక్కచోట నిర్మించిన ప్రాజెక్టు కాదని అది అనేక బరాజ్‌ల సమూహమని జగదీశ్‌రెడ్డి తెలిపారు. మేడిగడ్డకు సంబంధం లేకుండానే గోదావరి జలాలు కాలువల్లో పారుతాయని పేర్కొన్నారు. గోదావరి ప్రాణహిత నదుల కలయిక అనంతరం సుమారు 30 కిలోమీటర్ల దూరంలో మేడిగడ్డ వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మించగా అక్కడి నుంచి అన్నారం వద్ద సుందిళ్ల తదనంతరం శ్రీపాద ఎల్లంపల్లి బరాజ్ అక్కడి నుంచి నంది మేడారం రిజర్వాయర్ మీదుగా మిడ్‌మానేరుకు గోదావరి జలాలు చేరుకుంటాయని తెలిపారు. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా కాకతీయ మెయిన్ కెనాల్ నుంచి లోయర్ మిడ్ మానేరుకు చేరుకొని నేరుగా బయ్యన్నవాగు… తదనంతరం సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గంలోకి నీళ్లు ప్రవేశిస్తాయని చెప్పారు.
మేడిగడ్డకు సంబంధం లేకుండా ప్రస్తుతం నందిమేడారం వద్ద రోజుకు లక్ష క్యూసెక్కుల గోదావరి జలాలు వృథాగా పోతున్నాయని, నందిమేడారం వద్ద పంపులు ఆన్ చేస్తే చివరి ఆయకట్టు వరకు నీళ్లు చేరుతాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలి పోలేదు.. కొట్టుకుపోలేదని అన్నారు. దీనిపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరాన్ని పండబెట్టించి.. ఓ పక్క చంద్రబాబుకు నీళ్లను దోచిపెట్టేందుకు కాగా మరో పక్క ఇసుక దోపిడీకి తెరలేపారని, ఇది వాస్తమని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం జలాల కోసం సూర్యాపేట జిల్లా నుంచే ఉద్యమం ప్రారంభం కావాల్సి ఉన్నదని, లక్ష మంది రైతులతో ప్రాజెక్టుల వద్దకు వెళ్లేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.