హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ) ః తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరుతో భయం కలిగిస్తోందని సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమకారుడు పాశం యాదగిరి ఆందోళన వ్యక్తం చేశారు. ‘తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకొని దశాబ్ది ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారు.? చేసిన తప్పులను కాంగ్రెస్ సరిదిద్దుకోవాల్సిందే.
ఈ డిమాండ్‌తోనే తెలంగాణ ఐక్య వేదిక తరఫున ప్రభుత్వ వేడుకలను బహిష్కరిస్తున్నాం’ అని పాశం యాదగిరి ప్రకటించారు. జూన్ 2న జరిగే ప్రభుత్వం జరప తలపెట్టిన సన్మానానికి ఎవరూ వెళ్లొద్దని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ప్రసా ద్ ల్యాబ్‌లో మంగళవారం నేర్నాల కిషోర్ రచించిన ‘దచ్చన్న దారిలో త్యాగాల పాట’ విడుదల కార్యక్రమానికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు కోదండరాం, హరగోపాల్, పాశం యాదగిరి, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేశ్‌గౌడ్, పాశం యాదగిరికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నదని, తెలంగాణ ఉద్యమకారులను ఈపండుగ సందర్భంగా ఘనంగా సన్మానిస్తుందని చెప్పా రు. దీనికి పాశం యాదగిరి అభ్యంతరం చెపుతూ మహేశ్‌కుమార్‌గౌడ్ చేతిలోని మైక్‌ను లాక్కున్నారు. తెలంగాణ కోసం చేసుకునే పండుగా.. దీనికి అభ్యంతరం చెప్పొద్దు. కాంగ్రెస్ పద్ధతి బాగా లేదని దాన్ని సరిచేసుకోవాలని సూచించారు. దీనిపై మహేశ్ స్పందిస్తూ ‘మీరు మాట్లాడేది తప్పు.
మాట్లాడే సందర్భం కాదు. ముఖ్యమంత్రి రమ్మంటే మీరు రాము అంటే ఎట్లా?’అని మహేశ్కమార్గౌడ్ అనడంతో గొడవ తీవ్రమైంది. పాశం యా దగిరి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులెవరు? దొంగలందరూ, ద్రోహులందరూ మీ పక్కన ఉన్నారు. కొట్లాడిన మేం ఎక్కడ ఉన్నాం? వాళ్లెక్కడ ఉన్నారు? ఐక్య కార్యాచరణ కమిటీ అంతా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసింది. ఎక్కడ ప్రజల సమస్య ఉంటే అక్కడ పోయినం. ఓపెన్‌కాస్ట్‌కు పోయినం. ఫా ర్మాసిటీకి పోయినం. రైతులు చచ్చిపోతే పోయినం.
ప్రతి చోటకు పోయినం. అట్లా త్యాగాలతో వచ్చింది. కేవలం రాజకీయ నేతలతో తెలంగాణ రాలేదు. తెలంగాణ కాంగ్రెసోళ్లను ఒప్పుకునేది లేదు. చంద్రబాబును ఒప్పుకునే సమస్యేలేదు. మాకు భయం అవుతున్నది. రేపు మళ్లా చంద్రబాబు ఏపీలో గెలిస్తే, తెలంగాణ – ఆంధ్ర కలిసిపోతుందేమో! అనే భయమవుతున్నది. మీ కాంగ్రెస్‌వాళ్లే కలుపుతామంటారేమోనని భయమవుతున్నది. ఎందుకం టే అలాంటి సూచనలు కనిపిస్తున్నాయి.
అందుకే మిత్రులందరం లాఠీ పట్టుకునే ఉందాం. లూటీచేసే వాళ్లపై లాఠీ లేపు దాం. 2వ తారీఖున జరిగే కార్యక్రమాన్ని బైయికాట్ చేస్తామని హెచ్చరిస్తున్నా. ప్రకటిస్తున్నా. దానికి మేము రావాలంటే మీ రు అర్హత సాధించాలి. చేసిన తప్పులన్నీ సరిదిద్దుకోవాలి. జూన్ 2న జరిగే సన్మాన కార్యక్రమానికి ఉద్యమకారులెవరూ హాజరుకావొద్దని పిలుపునిస్తున్నా’ అని పాశం యాదగిరి ప్రకటించారు. ఉద్యమకారులు పోవద్దని ఆగ్రహంగా పిలుపునిచ్చారు.