కోడేరు, ఆగస్టు 16 : ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నాయకులు, అధికారులు నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా బోగస్ ఇండ్లు మంజూరు చేస్తే జైలుకు పంపిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు పంచాయతీ కార్యాలయం వద్ద ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులు మంజూరైన లబ్ధిదారులకు ఆయన పత్రాలను పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను అధికారులు చదివి వినిపించారు. అక్కడే ఉన్న ఇండ్లు లేని పేదలు తమకెందుకు ఇండ్లు మం జూరు చేయలేదని, ఈ జాబితాలో అనర్హులు ఉన్నారంటూ నిరసన తెలిపారు. దీంతో మంత్రి మంజూరైన జాబితాను పక్కన పెట్టి వారం రోజుల్లో నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల తర్వాత తానే స్వయంగా వచ్చి నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఇండ్ల మంజూరులో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా సహించేది లేదని హెచ్చరించారు.