హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): మంత్రివర్గ విస్తరణపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మరోసారి ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ మేరకు శాసనసభ లాబీల్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా తనకు పదవి ఖాయమని, మంత్రి పదవి రేసులో తాను ఉన్నానని చెప్పారు. అధిష్ఠానం తన పేరును పరిశీలిస్తున్నదని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.
పార్టీ తన మాట వింటుందనే నమ్మకం ఉన్నదని విశ్వాసం వ్యక్తంచేశారు. తాను ఆశాజీవినని చెప్పారు. పదవుల విషయంలో అన్యాయం జరుగుతున్నా ఓర్చుకుంటున్నానని తెలిపారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్‌కు ఎమ్మెల్సీ ఇచ్చినా, మంత్రి పదవి ఇచ్చినా తనకు అభ్యంతరంలేదని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీసీ నేతకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని కోరారు.