Congress | హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 10 యూనివర్సిటీల వైస్చాన్స్లర్ల పదవీకాలం మే 21నే ముగుస్తుందని ముందే తెలిసినా కొత్త వీసీల నియామకంపై నిర్లక్ష్యం వహించి.. ఇప్పుడేమో వద్దనుకున్న విధానాన్నే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నది. పది వర్సిటీలకు ఇన్చార్జి వీసీలుగా సీనియర్ ఐఏఎస్‌లను నియమిస్తూ మంగళవారం వేర్వేరు జీవోలు జారీ చేసి మరోమారు ద్వంద్వ వైఖరిని బయటపెట్టుకున్నది. 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఐఏఎస్‌లను ఇన్‌చార్జ్జి వీసీలుగా నియమించినప్పుడు ఇదే కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇన్చార్జి వీసీల నియామకాన్ని పూర్తిగా తప్పుబట్టింది. రెగ్యులర్ వీసీలను నియమించాలని గొంతుచించుకున్నది. విద్యావేత్తలకు కాకుండా ఐఏఎస్‌లకు బాధ్యతలు ఎలా అప్పగిస్తారని అప్పట్లో ఆ పార్టీ నేత గూడూరు నారాయణరెడ్డి ప్రశ్నించారు. వీసీ పోస్టులంటే పార్ట్‌టైమ్ ఉద్యోగాలు కావని, కీలక బాధ్యతల్లో ఉండే ఐఏఎస్‌లు ఈ పదవికి న్యాయం చేయలేరని ఉచిత సలహాలిచ్చారు. బీజేపీ నేత కృష్ణసాగర్‌రావు సైతం అప్పట్లో కాంగ్రెస్‌తో గొంతుకలిపారు. ఇన్చార్జిలకు బదులు రెగ్యులర్ వీసీలను నియమించాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ మర్చిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం మంగళవారం 10 యూనివర్సిటీలకు ఐఏఎస్‌లను ఇన్చార్జి వీసీలుగా నియమించింది.
రెగ్యులర్ వీసీల నియామకం కోసం జనవరిలోనే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఆశావాహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. సెర్చ్‌కమిటీలు వేయాల్సిన తరుణంలో అనవసరపు అనుమానాలతో కాలాయాపన చేసింది. తర్వాత ఎన్నికలకోడ్ రావడంతో ప్రక్రియ మొత్తానికే బ్రేకులు పడ్డాయి. కొత్త వీసీల నియామకానికి ఎన్నికల సంఘం ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం సెర్చ్‌కమిటీలను నియమిస్తూ జీవోలు జారీ చేసినా కమిటీ సమావేశాల నిర్వహణకు ఇప్పటి వరకు ముహూర్తం కుదరలేదు. ఈ క్రమంలో రాష్ట్రంలోని 10 వర్సిటీల వీసీల పదవీకాలం మంగళవారం ముగియడంతో ఐఏఎస్‌లకు బాధ్యతలు అప్పగించింది.
రాష్ట్రంలోని 10 వర్సిటీల వీసీల పదవీకాలం మంగళవారం ముగుస్తుందని ముందే తెలిసినా మళ్లీ ఇన్చార్జిలనే నియమించడాన్ని విద్యార్థి సంఘాలు తప్పుబడుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విధానాన్ని వద్దన్న కాంగ్రెస్, ఇప్పుడు అదే విధానాన్ని అమలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాయి. తక్షణమే రెగ్యులర్ వీసీలను నియమించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్, ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మణికంఠ, లక్ష్మణ్, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు మూర్తి, నాగరాజు డిమాండ్ చేశారు. శాశ్వత వీసీల నియామకంపై కాలయాపన చేస్తూ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసే కుట్ర పన్నిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ మండిపడ్డారు. గత ప్రభుత్వం ఇన్చార్జి వీసీలను నియమిస్తే గగ్గోలు పెట్టి, విద్యార్థులను గందరగోళానికి గురి చేసిన కాంగ్రెస్, ఇప్పుడు అధికారంలోకి రాగానే మాటమార్చిందని దుయ్యబట్టారు. కోడ్ అమలులో ఉన్నా వీసీలను నియమించుకోవచ్చని ఎలక్షన్ కమిషన్ అనుమతించినా పట్టించుకోకపోవడం చూస్తుంటే విద్యార్థులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో తేటతెల్లమవుతున్నదని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి లేకపోవడం, విద్యాశాఖపై ఒక్క సమీక్ష కూడా చేయకపోవడం బాధాకరమన్నారు.
‘విద్యావేత్తలకు కాకుండా ఐఏఎస్‌లకు ఇన్చార్జి వీసీ బాధ్యతలు ఎట్లా అప్పగిస్తరు.. వీసీ పోస్టులేమన్న పార్ట్‌టైమ్ ఉద్యోగాలా?.. కీలక బాధ్యతల్లో ఉండే ఐఏఎస్‌లు ఇన్చార్జి వీసీలుగా న్యాయం చేయలేరు’
– ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాదన