మంచిర్యాల, జనవరి 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సింగరేణి ఆస్తి వీసమెత్తు కూడా బయటికి పోనివ్వను.. ఎవరైనా గద్దల్లా వాలుతా అంటే వాలనివ్వను..’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గురువారం పర్యటించిన అయన.. కొన్ని మీడియా చానళ్లతో మాట్లాడారు. సింగరేణికి సంబంధించిన అంశంపై ఇప్పటికే తాను స్పష్టత ఇచ్చానని చెప్పారు. ‘సింగరేణి ప్రజల ఆస్తి.. దానిని ప్రజలకే ఉంచుతాం. నేను సింగరేణి బొగ్గు బాయిల్లోకి నడుచుకుంటూ వెళ్లిన వ్యక్తిని.
సింగరేణి ఆస్తిని వీసమెత్తు కూడా బయటికి పోనివ్వను. ఎవరైనా గద్దల్లా వాలుతా అంటే కూడా వాలనివ్వను’ అని వ్యాఖ్యానించారు. నైని బొగ్గు బ్లాక్‌కు సంబంధించి అసలు ఇంతవరకు ఎవరూ టెండర్లు వేయలేదని, ఇంకా ఆ ప్రక్రియే మొదలు కాలేదని చెప్పారు. అయినప్పటికీ, కొందరు ఊహించుకొని కట్టుకథలు రాశారని పేర్కొన్నారు. ఈ విషయంలో ఏ మాత్రం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉండకూడదని, అంతా పారదర్శకంగా చేయాలని, ఇప్పటివరకు జరిగిన ప్రక్రియను రద్దు చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. కొద్దిమంది కావాలనే కట్టుకథలు అల్లి రాస్తున్నారని, సింగరేణికి సంబంధించిన సమగ్ర సమాచారం రేపు (శుక్రవారం) ప్రజల ముందు పెడతానని వెల్లడించారు. తాను ఈ ప్రాంతంలో నడిచిన వ్యక్తినని, ఒక ఇంచు సింగరేణి భూమిని కానీ, ఒక బొగ్గు పెళ్లను గానీ సంస్థ నుంచి దూరం పోనివ్వనని చెప్పారు.