పార్టీ నాయకత్వాన్ని కేటీఆర్‌కు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయిస్తే, దాన్ని సంపూర్ణంగా స్వాగతిస్త్తా. కచ్చితంగా నూటికి నూరుశాతం కేటీఆర్‌కు సహకరిస్తా. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని శిరసావహిస్తానే తప్ప గీత దాటే వ్యక్తిని కాదు నేను.
– హరీశ్
Harish Rao | హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): పరిపాలన చేతగాక, గులాబీ నేతలను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక, బీఆర్ఎస్లో నాయకత్వ వివాదమంటూ సోషల్‌మీడియాలో కాంగ్రెస్ చేస్తున్న కుట్రపూరిత ప్రచారానికి సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు చెంపపెట్టు సమాధానమిచ్చారు. బీఆర్ఎస్ ముఖ్య నేతల నడుమ ఎలాంటి విభేదాలుగానీ, ఆధిపత్య పోరుగానీ లేనే లేదని ఆయన కుండబద్దలు కొట్టినట్టు ప్రకటించారు.
తద్వారా గులాబీ శ్రేణుల్లో అయోమయాన్ని సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఆయన తెరదించారు. సోషల్ మీడియా వేదికగా తనపై సాగుతున్నది కేవలం కొందరి దుష్ప్రచారమని, కట్టుకథ అని హరీశ్ స్పష్టంచేశారు. గత 25 ఏండ్లుగా తాను కేసీఆర్ గీసిన గీత దాటలేదని, ఇకపై కూడా దాటే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రదాత, మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడైన కేసీఆర్.. మున్ముందు పార్టీ నాయకత్వ బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగిస్తే, తాను స్వాగతిస్తానని హరీశ్‌రావు నిర్దంద్వంగా పేర్కొన్నారు.
క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కేటీఆర్‌కు సంపూర్ణంగా సహకరిస్తానని, ఆయన నాయకత్వంలో పనిచేస్తానని పేర్కొన్నారు. వడ్ల కొనుగోలులో సమస్యలపై హరీశ్ రావు మంగళవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారంపై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు.
“నా లీడర్ కేసీఆర్. ఆయన ఏం చెప్పినా, నేను తు.చ. తప్పకుండా పాటిస్తాను. అంతేతప్ప గీత దాటే సమస్యే లేదు” అని హరీశ్‌రావు వివరించారు. నాయకత్వ మార్పిడిపై బీఆర్ఎస్లో తీవ్ర చర్చ జరుగుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది కదా.. అని విలేఖరులు ప్రశ్నించినప్పుడు “అసలు నాయకత్వం ఎవరికి అనే పంచాయితీయే మా పార్టీలో లేదు. కేసీఆర్ మా పార్టీ అధ్యక్షుడు. ఆయన ఆదేశాలే అంతిమం. కేసీఆర్ ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీశ్‌రావు.
ఇప్పుడే కాదు; ఇదే విషయాన్ని కొన్ని వందల సార్లు, వందల సభల్లో, ప్రెస్మీట్లలో, టీవీ డిస్కషన్లలో, చిట్చాట్లలో చెప్పిన. అనేక సందర్భాల్లో స్పష్టంచేసిన. కేసీఆరే మా అందరి నాయకుడు. అంతేకాదు; పార్టీ నాయకత్వాన్ని కేటీఆర్‌కు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయిస్తే, దాన్ని సంపూర్ణంగా స్వాగతిస్త్తా. కచ్చితంగా నూటికి నూరుశాతం కేటీఆర్‌కు సహకరిస్తా. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని శిరసావహిస్తానే తప్ప గీత దాటే వ్యక్తిని కాదు నేను. నా 25 ఏండ్ల రాజకీయ ప్రస్థానమే దీనికి నిదర్శనం” అని హరీశ్‌రావు ఉద్ఘాటించారు.
“నేను 25 ఏండ్లుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ అడుగుజాడల్లో, ఆయన సూచనలకు అనుగుణంగా పనిచేసే ఒక కార్యకర్తగా పనిచేశాను. ఇకపైనా పనిచేస్తాను” అని స్పష్టంచేశారు. “మై లీడర్ ఈజ్ కేసీఆర్. వాట్ ఎవర్ కేసీఆర్ సేస్, హరీశ్‌రావు విల్ ఫాలో ఇట్. దట్సాల్ (నా నాయకుడు కేసీఆర్. కేసీఆర్ చెప్తాడు, హరీశ్ పాటిస్తాడు. అంతే, ఇందులో ఇంకోమాటే లేదు)” అని హరీశ్ విస్పష్టంచేశారు.
ప్రజలకు మంచి చేయడం ఎలాగో తెల్వనివారు, తమ మధ్య లేనిపోని అపోహలు సృష్టించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, సఫలం కారని, కాలేరని ఆయన తేల్చిచెప్పారు. పార్టీలోని ముఖ్యుల మధ్య దశాబ్దాలుగా ఉన్న అనుబంధాలను కల్పిత కథనాలతో, కుట్రపూరిత ప్రచారాలతో చెడగొట్టడం సాధ్యంకాదని.. ఇటువంటి ఎత్తుగడలకు బీఆర్ఎస్ వంటి పార్టీ లొంగిపోదని హరీశ్‌రావు స్పష్టంచేశారు.
ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దు
సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారాన్ని, తనపై వస్తున్న తప్పుడు వార్తలను నమ్మొద్దని హరీశ్‌రావు పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. తనపై వచ్చిన తప్పుడు కథనాలను తాను అదే రోజు ఖండించానని గుర్తు చేశారు. “ఖండించడమే కాదు; తనపై సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారి మీద చర్యలు తీసుకోవాలని నేనే కోరాను. ఈ మేరకు పార్టీ తరఫున బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించాను. ఫిర్యాదు పత్రాలను ఎక్స్‌లో పోస్ట్ చేశాను. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కూడా కోరాను” అని హరీశ్‌రావు వివరించారు.