Jagadish Reddy | హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ ) : అసెంబ్లీలో బీఆర్ఎస్ నుంచి ఎవరు మాట్లాడినా సస్పెండ్ చేయాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ వ్యూహమని, పథకం ప్రకారమే తనపై సస్పెన్షన్ వేటు వేశారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. సభలో కుట్రపూరితంగా బీఆర్ఎస్ సభ్యుల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని, కాంగ్రెస్ వాళ్లకే సమయం ఇస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం, ప్రభుత్వ వైఫల్యాలపై తాను మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ నేతలు గందరగోళం సృష్టించారని ఆగ్రహం వ్య క్తంచేశారు. గవర్నర్ ప్రసంగం గురించి కాంగ్రెస్ నుంచి ఒక్క సభ్యు డు కూడా మాట్లాడలేదని విమర్శించారు. తానెక్కడా స్పీకర్‌ను ఏకవచనంతో మాట్లాడలేదని, సభా సంప్రదాయాలకు వ్యతిరేకంగా వ్యవహరించలేదని తెలిపారు.
స్పీకర్ సభ్యులందరినీ సమానంగా చూడాలని కోరానని, బీఆర్ఎస్ సభ్యులు ఎవరు కూడా సభను తప్పుదోవ పట్టించలేదని గుర్తుచేశారు. ఘటన తర్వాత తాము స్పీకర్‌ను కలిశామని, తప్పు జరిగినట్టు భావిస్తే గత సంప్రదాయాల ప్రకారం వ్యవహరించాలని కోరినట్టు తెలిపారు. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి డైరెక్షన్ ప్రకారమే సభను వాయిదా వేశారని ఆరోపించారు. స్పీకర్‌ను తాను అగౌరవపర్చలేదని, ఒకవేళ తాను తప్పుగా మాట్లాడి ఉంటే కాంగ్రెస్ నేతలు వీడియో విడుదల చేసేవారని తెలిపారు. సస్పెన్షన్ తర్వాత కనీసం లెజిస్లేటివ్ పార్టీ కార్యాలయంలో కూడా తనను కూర్చోనివ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తన గొంతు ఎవరూ నొక్కలేరని తేల్చిచెప్పారు. సస్పెన్షన్ అంశంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో చర్చించి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.