జగిత్యాల, మార్చి 24 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి టీ జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం చేసిన చివరి ప్రయత్నాలు విఫలమయ్యాయి. గౌరవం లేనిచోట కొనసాగడం సాధ్యం కాదని, కాంగ్రెస్ పార్టీకి బుధవారం రాజీనామా చేయడం తథ్యమని జీవన్‌రెడ్డి ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడితోపాటు పార్టీ నాయకత్వానికి తేల్చిచెప్పారు. దాదాపు 35 నిమిషాలపాటు జీవన్‌రెడ్డి ఇంట్లో అంతర్గత సమావేశంలో.. ‘నలభై ఏండ్లుగా పార్టీలో ఉన్న మీరు పార్టీని వదిలిపెట్టవద్దు’ అని పీసీసీ అధ్యక్షుడు, ఇతరులు కోరగా.. దానికి జీవన్‌రెడ్డి ససేమిరా అన్నారు.
ఇరువై నెలలుగా తాను, తన కార్యకర్తలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని జీవన్‌రెడ్డి పీసీసీ చీఫ్‌నకు వివరించారు. పార్టీలోకి శత్రువును తీసుకొచ్చి తమను ఇబ్బందుల పాల్జేస్తున్నారని ఆగ్రహించినట్టు సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి కుట్రపూరితంగా తనకు అన్యాయం చేశారంటూ మండిపడినట్టు తెలిసింది. ‘పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ సీఎం అవుతారు. ఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అవుతారు. మరి మండలిలో ఉన్న ఏకైక లీడర్‌ను నేను మంత్రిని కావద్దా?’ అంటూ ప్రశ్నించడంతో పీసీసీ అధ్యక్షుడితోపాటు ఇతరులు బిత్తరపోయినట్టు సమాచారం. సమావేశం సందర్భంగా జీవన్‌రెడ్డి అనుచరులు కొందరు పార్టీ అధిష్ఠాన వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపించింది.
జీవన్‌రెడ్డితో అంతర్గత సమావేశం అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. 43 ఏండ్ల సాన్నిహిత్యం జీవన్‌రెడ్డికి ఉన్నదని, అలాంటి వ్యక్తి పార్టీని విడిచిపోతాడని తాము అనుకోవడం లేదని అన్నారు. జీవన్‌రెడ్డికి అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అధిష్ఠానం దృష్టిలో ఈ విషయం ఉన్నదని, న్యాయం జరుగుతుందని చెప్పారు. కాగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆహ్వానితుడు వంశీచందర్ రెడ్డి సాయంత్రం జీవన్‌రెడ్డిని కలిశారు. రాజీనామా నిర్ణయాన్ని వెనకి తీసుకోవాలని కోరారు. వారితో సమావేశం అనంతరం కూడా జీవన్ రెడ్డి బుధవారం పార్టీకి రాజీనామా చేస్తానని మరోసారి స్పష్టం చేశారు.
బుధవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని, ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అనుచరులు, సహచరులు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి కోరారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో సమావేశం ముగిసిన నిమిషాల వ్యవధిలోనే.. బుధవారం తన రాజీనామా కార్యక్రమం ఉంటుందని ప్రకటించారు. అనుచరులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.
జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని పేర్కొనడంతో ఆయన అనుచరులు, అభిమానుల్లో ఉత్సాహం పెరిగిపోయింది. సోషల్ మీడియా నుంచి మొదలు కొని అన్ని రీతుల్లోనూ తమ ఉత్సాహాన్ని క్యాడర్ ప్రదర్శించడం ప్రారంభించింది. పీసీసీ అధ్యక్షుడు వచ్చిన సమయంలో డీసీసీ అధ్యక్షుడు సైతం వచ్చేందుకు యత్నించగా.. జీవన్‌రెడ్డికి వెన్నుపోటు పొడిచిన డీసీసీ అధ్యక్షుడు ఇంటికి వస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీసీసీ అధ్యక్షుడితో నేరుగా కొందరు నాయకులు వాదనకు దిగడంతోపాటు ప్రశ్నల వర్షం కురిపించి ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపించింది. జీవన్‌రెడ్డి ఇంటిపైన ఉన్న ఇందిరాభవన్ ఫ్లెక్సీని కార్యకర్తలు తొలగించారు.