CM KCR | దేశంలో ఎక్కడా లేని విధంగా ఆదర్శమూర్తి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు నా జన్మ ధన్యమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రధాన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టుకున్నామని కేసీఆర్ తెలిపారు. ఈ నెల 30 నుంచి సెక్రటేరియట్‌ను ప్రారంభించుకోనున్నాం. ఆకాశమంత ఎత్తు ఉండే, అందరికీ మార్గదర్శకత్వం చేసేలా ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఎత్తయిన మహోన్నత విగ్రహాన్ని ప్రతిష్టించుకున్న ఘనత తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రభుత్వానికే దక్కింది అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఇవాళ నాకు గర్వంగా ఉంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆదర్శమూర్తి విగ్రహాన్ని తీర్చిదిద్దుకున్నందుకు.. ఈ అవకాశం నాకు కలిసి వచ్చినందుకు నా జన్మ ధన్యమైంది అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రమే కాదు.. భారతదేశాన్ని కూడా సరైన వరుసలో పెట్టేందుకు చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేయడం జరుగుతుంది. ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదు. మరోసారి అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వకంగా జై భీమ్‌లు తెలియజేసుకుంటున్నానని చెబుతూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.