Penta Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): సమైక్య పాలకుల కుట్రల్లో నలిగిపోయారు.. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు..ఈసడింపులకు గురయ్యారు.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో సముచితస్థానం దక్కడంతో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల నిర్మాణంలో కీలకభూమిక పోషించారు. 45 ఏండ్ల ప్రస్థానంలో నిన్నటి పాలమూరు ప్రాజెక్టులోని 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటర్లను ప్రారంభించి.. ఇప్పటికీ 251 భారీ పంపులను విజయవంతంగా అమర్చిన ఘనతను సొంతం చేసుకొన్నారు. అందుకే ఆయన్ను ‘లిఫ్ట్’ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా చెప్పవచ్చు.. ఆయనే హైడ్రోఎలక్ట్రికల్ ఇంజినీర్ పెంటారెడ్డి. ‘పాలమూరు’ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన ఆయన తెలంగాణలో భారీ ప్రాజెక్టుల నిర్మాణం.. దాని వెనుక దాగి ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రమను ఆయన ‘నమస్తే తెలంగాణ’తో పంచుకొన్నారు.
తెలంగాణ ఎత్తిపోతల పథకాల చరిత్ర ఏమిటి?
నీరు కింది నుంచి పోతున్నది. తెలంగాణ భూము లు మీద ఉన్నయి. ఎత్తిపోసుకోవడం తప్ప మరే మార్గం లేదు. శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రం పనులు చేస్తున్న సందర్భంలో జపాన్ కంపెనీ ప్రతినిధి అహిజా అక్కడికి వచ్చారు. ఎటుచూసినా పడావు పడ్డ భూములే ఉండటం గమనించి, ఇదేమిటి అని నన్ను అడిగారు. భారీ పంపులను పెట్టి నీటిని ఎత్తిపోసి వాటికి ఎందుకు అందించకూడదు అని నన్ను ప్రశ్నించారు. ఆ ప్రశ్న నాలో ఆలోచన రేకేత్తించింది. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టా. అప్పటికీ భారీ రివర్సెబుల్ టర్బైన్స్, జనరేటర్ల మోటర్లను అమర్చిన అనుభవమూ తోడయింది. ఎట్టకేలకు పుట్టంగండి వద్ద ఎలిమినేటి మాధవరెడ్డి పథకం విజయవంతం చేశాం. దాంతో భారీ పంపులతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలకు తెలంగాణలో తొలి అడుగులు పడ్డాయి.
వృత్తి జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి?
ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతలు విజయవంతం అయ్యాక నాపై ఆంధ్రా నేతల్లో ఒక రకమైన విద్వేషం ఏర్పడింది. ఎప్పుడూ పనికిమాలిన కొత్త ప్రతిపాదనలు ముందు పెడతావేంటి అని ఈసడించుకొనేవారు. ఎంక్వయిరీ కమిషన్ వేస్తాం, కోర్టుకు లాగుతామని బెదిరించారు. అయినా తెలంగాణకు ప్రాజెక్టులు రావాలనే కాంక్షతో పనిచేస్తూ ముందుకుపోయా. 2002లో విరమణ పొందిన అనంతరం రెండేండ్లు సర్వీస్‌ను పొడిగించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణకు వాటిల్లుతున్న నష్టాన్ని చూసి ఓర్చుకోలేకపోయా. ఉద్యోగానికి రాజీనామా చేశా. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్లందరం కలిసి ‘బై ది తెలంగాణ.. ఆఫ్ ది తెలంగాణ’ అనే కాన్సెప్ట్‌లో ఏర్పాటు చేసిన ఈఎంసీ కన్సల్టెన్సీలో సేవలు అందించా. అక్కడ కూడా వైఎస్ కక్ష చూపించారు. నాకు కన్సల్టెన్సీ ఇవ్వొద్దు అని ఆదేశాలు జారీ చేశారు. వచ్చిన పలు ప్రాజెక్టులను రద్దు చేశారు. ఒకానొక సందర్భంలో మీరు సమావేశాలకు రావొద్దని ముఖం మీదే చెప్పారు. ఇలాంటివి ఎన్నో. ఇలాంటి సవాళ్లన్నింటినీ అధిగమించాం.
భారీ పంపుల నిర్వహణ ఎలా సాధ్యమైంది?
నాగార్జునసాగర్ జల విద్యుత్తు కేంద్రంలో 108 మెగావాట్ల రేటింగ్ కలిగిన 7, శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలో 150 మెగావాట్ల రేటింగ్ కలిగిన 6 రివర్సెబుల్ టర్బైన్స్‌ను ఏర్పాటు చేయడంలో పనిచేశాను. ఆ పనికి ముందు బీహెచ్ఈఎల్ నుంచి ఇద్దరు, విద్యుత్తు బోర్డు నుంచి ఇద్దరు ఇంజినీర్లను హిటాచి కంపెనీలో శిక్షణ కోసం జపాన్‌కు పంపించారు. ఆ శిక్షణలో భారీ పంపులు, మోటార్ల డిజైన్, తయారీ, వాటి అనుబంధ సాంకేతిక అంశాలను నేర్చుకున్నా. వాటికి సంబంధించిన సాంకేతిక పత్రాలను వెంట తెచ్చుకున్నా. ఆ అనుభవంతో నాగార్జునసాగర్, శ్రీశైలం, లోయర్ సీలేరు జల విద్యుత్తు కేంద్రాల నిర్మాణంలో సేవలు అందించా. ఆ అనుభవమే ఎత్తిపోతల పథకాల నిర్మాణంలో ఉపయోగపడింది. ఆ ఆత్మవిశ్వాసంతోనే 139 మెగావాట్లు, 145 మెగావాట్ల భారీ పంపులను విజయవంతంగా నడిపి, నీటి ఎత్తిపోతలను ప్రారంభించాం.
ఎత్తిపోతల పథకాలపై కరెంటు భారం అంటుంటారు? వాస్తవమేనా?
అది ఒక కుట్ర. ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు అనుసరించిన విధానం. ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం విజయవంతం కావడంతో నాటి సీమాంధ్ర పాలకులకు ఏదీ తోచలేదు. ఎలాగైనా ఎత్తిపోతల పథకాలు వయబిలిటీ కాదనే ప్రచారం చేయాలని చూశారు. అందులో భాగంగానే అప్పటివరకు 1 హెచ్‌పీకి ఏడాదికి రూ.50 ఉన్న కరెంట్ చార్జీలను తొలగించి, యూనిట్‌కు రూ.1.80, తర్వాత రూ.2.60 ఇలా అసాధారణంగా పెంచుకుంటూ పోయారు. ఎత్తిపోతల పథకాలు వయబిలిటీ కావనే ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కానీ వాస్తవం ఏంటంటే ఎత్తిపోతల పథకాల ద్వారా దాదాపు 10 శాతం విద్యుత్తు ఆదా అవుతున్నది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే బాయి తవ్వి.. మోటర్ పెట్టి చేసే ఖర్చు కన్నా.. ఇది చాలా తక్కువ. పంపింగ్ స్టేషన్లు కాస్ట్ అనడానికి మీనింగ్ ఉండదు. అందుకే ఎత్తిపోతల పథకాలు ఎంత వయబిలిటీ అనేదానిపై ఒక పుస్తకమే రాశాను. త్వరలోనే అది మీ ముందుకు వస్తుంది.
మీకు సంతృప్తినిచ్చిన ఎత్తిపోతల పథకమేది?
నాకు అత్యంత సంతృప్తినిచ్చిన పథకం పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టే. ఆ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన విశ్రాంత ఇంజినీర్లలో నేను ఒకడిని. ఉద్యోగానికి రాజీనామా చేశాక ఆ ఫైలు పట్టుకొని కలువని నాటి మంత్రి, ఎమ్మెల్యే లేడు. ప్రాజెక్టుకు జీవో తీసుకొచ్చే వరకూ అనేక రకాలుగా ఒత్తిడి చేశాం. ఊరూరా తిరిగేటోళ్లం. నాటి చీఫ్ మినిస్టర్ ఏ ప్రాజెక్టును సందర్శించినా అక్కడ ప్రత్యక్షమయ్యేవాళ్లం. ఆ విధంగా ఒత్తిడి చేసినా చివరకు కిరణ్‌కుమార్ కేవలం సర్వే కోసం మాత్రమే జీవో ఇచ్చారు. ఆ ప్రాజెక్టును చూస్తానా? అని అనిపించేది. ఎందుకంటే ఆ పాలమూరు ప్రాజెక్టు ద్వారా మా వికారాబాద్‌కు..ధరూర్ మండలానికి సాగునీళ్లు వస్తాయి. ఎట్టకేలకు సీఎం కేసీఆర్ పట్టుదలతో ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది. నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రాజెక్టులో నేను భాగస్వామిని కావడం ఆనందంగా ఉన్నది. అన్నింటికన్నా నాకు ఇదే ఎంతో సంతృప్తినిచ్చింది.
ఎత్తిపోతల పథకాల భవిష్యత్తు నిర్వహణ ఎలా?
సీఎం కేసీఆర్ దార్శనికత ఎంతో గొప్పది. యువ ఇంజినీర్లను పంప్‌హౌస్ నిర్మాణాల్లో భాగస్వాములుగా చేశారు. వివిధ చోట్ల పనిచేస్తున్న ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీర్లను పంప్‌హౌస్ నిర్మాణ పనులకు బదిలీ చేశారు. సీఎం దిశానిర్దేశం మేరకు ఆయా విభాగాల్లో తర్ఫీదు పొందారు. పంపుహౌస్‌లను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అన్నింట్లోనూ అనుభవం సాధించారు. పంప్‌హౌస్‌ల నిర్వహణ కోసం సమగ్రమైన ఆపరేషన్ మాన్యువల్ రూపొందించాం. ఇరిగేషన్లో సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగం కూడా గొప్ప ఫలితాలను అందిస్తున్నది. పంప్‌హౌస్‌ల నిర్వహణలో కీలకభూమిక పోషిస్తున్నది.
స్వరాష్ట్రంలో ప్రాజెక్టు నిర్మాణ పనుల తీరు వివరిస్తారా?
నేను చూసిన నాయకులు, ముఖ్యమంత్రుల్లో అందరికన్నా సీఎం కేసీఆర్ గ్రేట్ విజినరీ లీడర్. డెడికేషన్ వర్క్ ఎక్కువ ఉంది. నిర్ణీత గడువు పెట్టుకొని పనులు కొనసాగిస్తారు. ఆ దిశగా అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తారు. పనులు విషయంలో ఒక మాట చెప్పారంటే ఆ సమయానికల్లా అది జరిగి తీరాల్సిందే. లేదంటే ఎంతటి వారినైనా ఉపేక్షించరు. అదే సమయంలో అధికారులకు స్వేచ్ఛ కూడా ఇస్తారు. ఆ విధంగా పనిచేసే వారు ఎవరైనా, ఎక్కడివారైనా, ఏ స్థాయిలో ఉన్నా సరే గుర్తించి ఎంపిక చేసుకొంటారు. అదే సీఎం కేసీఆర్ విజయ రహస్యం. అతి స్వల్పకాలంలో భారీ ప్రాజెక్టులు నిర్మాణం పూర్తికావడానికి ప్రధాన కారణం. అందుకు నేనే ఒక ఉదాహరణ. తెలంగాణ ఏర్పాటు అనంతరమే నన్ను పిలిచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అడ్వయిజర్‌గా నియమించారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి గొప్ప ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం కల్పించారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నా కృతజ్ఞతలు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఎత్తిపోతల పథకాల పరిస్థితి ఏమిటి?
వాస్తవంగా చెప్పాలంటే కృష్ణాలో ఒక్క ప్రాజెక్టును కూడా కట్టడం అప్పటి ఉమ్మడి ఏపీ పాలకులకు ససేమిరా ఇష్టం లేదు. తెలంగాణకు ఎట్టిపరిస్థితుల్లోనూ నీళ్లు దక్కకూడదనేది వారి ఉద్దేశం. అందుకు ఎలిమినేటి మాధవరెడ్డి పథకం ఓ ఉదాహరణ. తెలంగాణ ఉద్యమం, ప్రజల ఒత్తిడి ఫలితంగానే ఉమ్మడి పాలకులు తొలిసారిగా ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు ముందుకువచ్చారు. ఎన్టీఆర్ హయాంలోనే 60 మెగావాట్ల సామర్థ్యమున్న పంపులను ప్రపోజ్ చేసి, 6 వేల క్యూసెక్కులను ఎత్తిపోసేలా ప్రతిపాదించాం. అంతా ఒప్పుకున్నాక పనిగట్టుకుని, కుట్రపూరితంగా వైఎస్ అవినీతి ఆరోపణలు చేయగా, ఎన్టీఆర్ ఆ ప్రాజెక్టును మూలకుపడేశారు. ఆ తర్వాత 15 ఏండ్లపాటు దానికి బలం రాలేదు. కేసీఆర్ మడమతిప్పని పోరాటం..తెలంగాణ మలి దశ ఉద్యమం నేపథ్యంలో చంద్రబాబు ఆ ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇచ్చారు. 60 మెగావాట్ల స్థానంలో 18 మెగావాట్ల పంపులను, కేవలం 2,600 క్యూసెక్కులను మాత్రమే ఎత్తిపోసేలా ప్రాజెక్టును కుదించారు. ఆ పథకం విజయవంతం అవుతుందని ఉమ్మడి ప్రభుత్వాధినేతలు ఎవరూ కూడా ఊహించలేదు. పనుల నిర్వహణకు ఒక్క ఆంధ్ర అధికారి సహకరించేవారు కాదు. అయితే మా ఆశ ఒక్కటే. ఎట్లయినా ఆ ఎత్తిపోతల పథకం విజయవంతం కావాలె. ఆ దీక్షతో పనిచేశాం. తెలంగాణ అధికారులతో కలిసి స్వయంగా డిజైన్లు, మోటర్ ఫిట్టింగ్ పనులన్నీ పూర్తి చేసి, విజయవంతంగా నీటి ఎత్తిపోతలను చేసి చూపాం. తెలంగాణకు ఒక కొత్త ఆశ మొగ్గ తొడిగింది. అంతే వెంటనే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ పథకాల డిమాండ్లు మొదలయ్యాయి.
మీ నేపథ్యం, సాధించిన విజయాల గురించి చెప్తారా?
నాది వికారాబాద్ జిల్లా ధరూర్ మండలంలోని కైరెళ్లి గ్రామం. మాది వ్యవసాయ కుటుంబం. ఐదుగురు అన్నదమ్ముల్లో మూడోవాడిని. ప్రాథమిక విద్య వికారాబాద్‌లో పూర్తిచేశా. హైదరాబాద్ సిటీ సైన్స్ కాలేజీలో పీయూసీ చదివా. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (ఎస్పీఎల్) 1966లో పూర్తి చేశా. ఉస్మానియా ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రికల్ గ్రూప్‌లో డిగ్రీ కోర్సులో చేరి 1970లో పూర్తి చేశా. 1969 తెలంగాణ ఆందోళనల దృష్ట్యా ఓ సంవత్సరం కోల్పోయా. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అప్పటి ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (ఏపీఎస్ఈబీ)లో జేఈగా ఉద్యోగంలో చేరాను. 2002లో ఉద్యోగ విరమణ పొందిన అనంతరం అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం మరో రెండేళ్లు సర్వీస్‌ను పొడిగించింది. తెలంగాణకు వాటిల్లుతున్న అన్యాయాన్ని చూడలేక ఆ ఉద్యోగానికి రాజీనామా చేశా. ఈఎంసీ కన్సల్టెన్సీలో కన్సల్టెంట్‌గా పనిచేశా. ఉమ్మడి రాష్ట్రంలో ఏమాత్రం గుర్తింపునకు నోచుకోని నాకు సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పించారు. లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారుగా నియమించారు.
ఉమ్మడి రాష్ట్రంలో అన్ని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్లలో పనిచేశా. విద్యుత్తు ఉత్పాదక స్టేషన్లు, పంపింగ్ స్టేషన్లలో సుమారు 35 ఏండ్లపాటు పనిచేసిన. 25 ఏండ్లపాటు ఔట్‌డోర్‌లోనే ఉండి సేవలందించిన. ఫారం ఫార్ములేషన్, డిజైన్, మెటీరియల్ సేకరణ, ఎరక్షన్, టెస్టింగ్, కమిషనింగ్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ల ఆపరేషన్, మెయింటెనెన్స్ కార్యకలాపాలు, 250 కేవీ చిన్న హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ల నుంచి ఇటీవల పాలమూరు పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన 145 మెగావాట్ల సామర్థ్యమున్న పంపులను విజయవంతంగా ప్రారంభించా. ఎలిమినేటి మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్‌తోపాటు అలిసాగర్, గుత్ప, కాళేశ్వరం, దేవాదుల, సంగమేశ్వర, బసవేశ్వర, భక్తరామదాసు, తుమ్మిళ్ల, సీతారామ, గూడెం, చిన్న కాళేశ్వరం, చౌటుపల్లి హనుమంత్‌రెడ్డి, మంథని, ఎల్లంపల్లి, ఎసారెస్పీ పునరుజ్జీవన పథకం, చనాక- కొరాట.. ఇప్పుడు పాలమూరు .. ఇట్లా అనేక ఎత్తిపోతలలో పంపులు అమర్చడంలో కీలకపాత్ర పోషించా. ఇప్పటికీ దాదాపుగా 251 భారీ పంపులను ప్రారంభించా. సీఎం కేసీఆర్ అప్పగించిన గురుతరబాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించా. తెలంగాణ ప్రభుత్వం నాకు సముచిత స్థానం కల్పించడమేకాదు కాళేశ్వరం, పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల్లో పనిచేసేలా గొప్ప వరమిచ్చింది.