ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని పత్తి ,సోయాబిన్ కోనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వైఖరిని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ -నాగపూర్ జాతీయ రహదారి 44 పై నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులు నిరసన తెలిపారు. పంటల కొనుగోలలో రెండు ప్రభుత్వాలు నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని నాయకులకు తెలిపారు. సీసీఐ తేమశాతం పేరిట పత్తిని మద్దతు ధరతో కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు.
రైతులకు మద్దతు ధర లభించకపోవడంతో మధ్య దళారులకు విక్రయించి పత్తి క్వింటాలుకు రూ.1500 చొప్పున నష్టపోతున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు ఏడు క్వింటాళ్లు మాత్రమే సీసీఐ కొనుగోలు చేస్తుందని, మిగిలిన పత్తిని రైతులు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారని తెలిపారు. సోయాబీన్ కొనుగోలు సైతం పలు నిబంధనలు అమలు చేస్తున్నారని, వేలిముద్ర తప్పనిసరి చేయడంతో రైతులు పంటను అమ్ముకునే పరిస్థితి లేదని వాపోయారు.
వర్షాల కారణంగా దెబ్బతిన్న సోయాబిన్ పంటను మార్క్ ఫెడ్ కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు విక్రయించిన నష్టపోతున్నారని తెలిపారు. పంటల కొనుగోలులో నిబంధనలు ఎత్తివేసే వరకు ఆందోళన నిర్వహించనునట్లు అఖిలపక్షం నాయకులకు తెలిపారు. రైతుల ఆందోళన ఫలితంగా జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి.