రాంచీ: పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 40 ప్రదేశాల్లో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు చేస్తున్నది. అక్రమ బొగ్గు మైనింగ్(Illegal Coal Mining), రవాణా, స్టోరేజ్ కేసులో ఈ సోదాలు జరుగుతున్నాయి. బెంగాల్‌లోని 24 ప్రాంతాలు, జార్ఖండ్‌లోని 18 ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. బెంగాల్‌లోని దుర్గాపూర్, పురిలియా, హౌరా, కోల్‌కతా జిల్లాల్లో సోదాలు జరుగుతున్నాయి. బొగ్గు చోరీ, స్మగ్లింగ్‌కు సంబంధించిన పలు కేసుల్లో ఈడీ ఈ తనిఖీలు కొనసాగిస్తున్నది. భారీ ఎత్తున బొగ్గు మాయం అయిన ఘటనల వల్ల ప్రభుత్వానికి తీవ్ర ఆర్థిక నష్టం ఏర్పడింది. సుమారు వందల కోట్లల్లో నష్టం ఉంటుందని ఈడీ పేర్కొన్నది.
నరేంద్ర ఖార్కా, యుదిష్టర్ ఘోష్, కృష్ణ మురారి కయాల్, చిన్మయి మోండల్, రాజ్కోషరే యాదవ్‌కు చెందిన ప్రదేశాల్లో సోదాలు జరుగుతున్నాయి. బొగ్గు మాఫియాకు పాల్పడుతున్న వారిపై సుమారు వందకుపైగా ఈడీ అధికారులు ఇవాళ దాడులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకే సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. రెసిడెన్షియల్ ప్రాపర్టీలు, ఆఫీసులు, కోక్ ప్లాంట్లు, అక్రమ టోల్ వసూళ్లు, చెక్‌పోస్టులు, నాకాలపై దాడులు కొనసాగుతున్నాయి.