హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 11 (నమస్తే తెలంగాణ ): విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పనితీరు రోజురోజుకూ వివాదాస్పదమవుతున్నది. పెద్దలు, పేదలు అనే తేడా లేకుండా ఆక్రమిత స్థలాల్లో ఉంటున్న వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన హైడ్రా.. ఆచరణలో ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి.
మొత్తంగా హై‘డ్రామా’లో సామాన్యులే సమిధలవుతున్నారని స్వయంగా హైడ్రా గణాంకాలే స్పష్టంచేస్తున్నాయి. ఏర్పాటు నుంచి ఈ నెల 8 వరకు జరిపిన కూల్చివేతలపై హైడ్రా బుధవారం నివేదిక విడుదల చేసింది. చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, జంట జలాశయాల ఎఫ్టీఎల్లో కట్టడాలు, పార్కు స్థలాల్లో 262 నిర్మాణాలను కూల్చివేసి 111.72 ఎకరాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది.
ఇందులో కూల్చివేతలు జరిపిన 23 ప్రాంతాల్లో గండిపేట ఖానాపూర్, మల్లంపేట విల్లాలు, నాగార్జున ఎన్ కన్వెన్షన్ మినహా మిగతా చోట్ల సామాన్యుడిపైనే బుల్డోజర్ ప్రతాపం చూపినట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, కావేరీ సీడ్స్ అధినేత జీవీ భాస్కర్‌రావు, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌రెడ్డి, ప్రో కబడ్డీ ఓనర్ అనుపమ, సినీ హీరో నాగార్జున తప్ప మిగిలిన పెద్దలు అక్రమంగా కట్టుకున్న భారీ భవంతులు, విల్లాలు, ఫాంహౌస్‌ల వైపు బుల్డోజర్లు వెళ్లలేదు.
బాచుపల్లిలో లేక్‌వ్యూ పాయింట్ తీరాన ప్రముఖంగా పేరొందిన బిల్డర్ కడుతున్న హైరైజ్ బిల్డింగ్ వైపు కూల్చివేతలకు వెళ్లిన హైడ్రా బుల్డోజర్లు తిరిగి వెంటనే వెనక్కి వచ్చాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలకు భారీగా ముడుపులు అందాయన్న చర్చ బిల్డర్లలో జరుగుతున్నది. సున్నం చెరువుకు సంబంధించి ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, కనీసం ఇంట్లో ఉన్న సామాన్లను సర్దుకునే సమయం ఇవ్వకుండా సామాన్యుడిని రోడ్డున పడేసి గుండెకోత మిగిల్చిన హైడ్రా..జయభేరి లాంటి ప్రముఖులకు మాత్రం నోటీసులతో సమయమివ్వడం పట్ల ప్రజలు భగ్గుమంటున్నారు. ప్రభుత్వం హైడ్రా పేరుతో హైడ్రామా ఆడుతున్నదని మండిపడుతున్నారు.
సీఎం, కమిషనర్ తలోమాట
అక్రమిత స్థలాల్లో ఉంటున్న వారిపై హైడ్రా కొరఢా ఝళిపిస్తుండగా కూల్చివేతలపై హైడ్రా చైర్మన్ అయిన సీఎం రేవంత్‌రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటనలు గ్రేటర్ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇటీవల సున్నం చెరువు, మల్లంపేట విల్లాల కూల్చివేతల సమయంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించి సామాన్యులు ఇప్పటికే నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని ప్రకటించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కట్టడాలను మాత్రమే తాము కూల్చుతున్నామని స్పష్టం చేశారు. అయితే ఇందుకు విరుద్ధంగా బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
ఆక్రమణలను కూల్చే బాధ్యత తానే తీసుకుంటానని, ఆక్రమణలకు పాల్పడిన ఎ వ్వరినీ వదిలి పెట్టబోనని, కూల్చివేతలపై స్టే తెచ్చుకున్నా కోర్టులో కొట్లాడుతామని స్పష్టంచేశారు. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌ను ఆక్రమించిన వారినీ వదిలేది లేదని, ఆక్రమణలను వ దిలి గౌరవంగా తప్పుకోండని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఒక మాట..కమిషనర్ మరో మాట మాట్లాడుతుండడం పలు అనుమనాలకు తావిస్తున్నది. వాస్తవంగా జూలై 19న హైడ్రా ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేసిన ప్రభుత్వం నేటికీ విధి విధానాలు ప్రకటించలేదు. పరిధి దాటి హైడ్రా కూల్చివేతలు జరిపింది. జీహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా హైడ్రాను తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించలేదు.
స్వాధీనం సరే..తట్టెడు మట్టి తీయలే
హైడ్రా ఇప్పటి వరకు 262 నిర్మాణాలను కూల్చివేసి 111.72 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. ఇందులో అత్యధికంగా అమీన్పూర్ లేక్‌కు సంబంధించి 51.78 ఎకరాలు, రాజేంద్రనగర్ బుమ్రాక్ 12, సున్నం చెరువు 10, గండిపేట లేక్ 8.75, చిల్కూరు 6.5 ఎకరాలతో పాటు మొత్తం 23 ప్రాంతాల్లో భూములను స్వాధీనం చేసుకున్నట్టు స్పష్టం చేసింది. వాస్తవంగా చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్, నాలాల వెంట వెలసిన కట్టడాలను కూల్చివేసిన హైడ్రా, వాటి వ్యర్థాల (డెబ్రీస్)ను ఎక్కడికక్కడే వదిలి వేసింది. కనీసం తట్టెడు చెత్తను కూడా తరలించలేదు. 111 ఎకరాలను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించిన హైడ్రా.. చెత్త, డెబ్రీస్‌ను ఎత్తివేయకుండానే చెరువులను పరిరక్షించామని చెబుతుండడం విస్తుగొలుపుతున్నది.