హైదరాబాద్ సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ) : నగరంలో మూసీ నది పరివాహక ప్రాంతంలో హద్దులను నిర్ధారించాలని పలువురు నిపుణులు తమకు సూచించినట్టు హైడ్రా పేర్కొంది. ‘మూసీ సరిహద్దు గుర్తింపు-ఓఆర్ఆర్ లోపల నాలా వ్యవస్థతో పాటు వెడల్పుల నిర్ధారణ’ అంశంపై శుక్రవారం బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో ఓ సదస్సు నిర్వహించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ మూసీ ఆక్రమణలపై ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఆ నది సరిహద్దుల నిర్ధారణ ఎలా చేపట్టాలనే విషయమై ఈ సమావేశంలో చర్చించారు. మూసీ ఆక్రమణలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నందున మూసీ గరిష్ఠ ప్రవాహ స్థాయిని హైడ్రా నిర్ధారిస్తేనే బాగుంటుందని నిపుణులు సూచించినట్టు హైడ్రా ప్రకటించింది. చెరువుల ఎఫ్టీఎల్ను గుర్తించినట్టుగానే మూసీ నది ఎంఎఫ్ఎల్ (మాగ్జిమమ్ ఫ్లడ్ లెవల్)ను గుర్తించేందుకు గ్రామ, రెవెన్యూ రికార్డులను దృష్టిలో పెట్టుకుని సరిహద్దులు నిర్ధారించాలని కొందరు నిపుణులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు సూచించారు.
మూసీ పరివాహక ప్రాంత హైడ్రాలజీ నివేదికలు, ఎన్ఆర్ఎస్సీ ఉపగ్రహ చిత్రాలు, సర్వే ఆఫ్ ఇండియా రికార్డులను పరిశీలించి మూసీ హద్దులను నిర్ధారించి నిర్మాణాలు జరగకుండా చూడాలని పలువురు చెప్పారు. నగరంలో 1908, 1954, 2000, 2008వ సంవత్సరాల్లో కురిసిన భారీ వర్షాలు, అప్పటి పరిణామాలను చర్చించి మూసీ నది పరివాహకంలో ఎక్కడా ఆటంకాలు లేకుండా చూడాలని వారు చెప్పారని హైడ్రా పేర్కొంది. వరద ముప్పునకు సంబంధించి నగరంలో నాలాలు కుంచించుకుపోకుండా చూడాలని, జీహెచ్ఎంసీ పరిధిలో 940 ప్రాంతాల్లో కల్వర్టులున్నాయని, అక్కడ చెత్త పేరుకుపోవడంతో వరదనీరు పోవడం లేదని నిపుణులు హైడ్రా దృష్టికి తెచ్చారు. పలుచోట్ల నాలాల లింక్ కట్ అయిందని, దానిని పునరుద్ధరించాలని, కొన్నిచోట్ల కుంచించుకుపోయాయని అక్కడ నిర్మాణాలకు ఎలాంటి ముప్పు లేకుండా.. కుదిరితే విస్తరణ లేకుంటే మళ్లింపు చేయాలని పలువురు అధికారులు చెప్పారని హైడ్రా తెలిపింది. ఈ సదస్సులో రెవెన్యూ, సర్వే, ఇరిగేషన్, హైడ్రాలజీ, ఎస్ఎన్డీపీ, ఎన్ఆర్ఎస్సీ, జీహెచ్ఎంసీ, మూసీరివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తోపాటు అర్బన్ డెవలప్మెంట్లో భాగస్వాములుగా ఉన్న పలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.