హైదరాబాద్ సిటీబ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ) : సామాన్యులతో హైడ్రా ఎలా ఆడుకుంటున్నదో ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. అడ్డూ అదుపులేని అధికారాలను చూసుకొని, గుడ్డెద్దు చేలో పడ్డట్టు చెరువుల చుట్టూ ఉన్న నిర్మాణాలపై బుల్డోజర్లతో హైడ్రా విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. తరతరాలుగా నివాసం ఉంటున్నామని చెప్తున్నా, ప్రభుత్వం అన్నిరకాల అనుమతులు ఇచ్చిన తర్వాతే ఇండ్లు కట్టుకొన్నామని మొత్తుకుంటున్నా చెవికెక్కించుకోకుండా ధ్వంసరచన కొనసాగిస్తున్నది. పైగా కూల్చేసిన చోట ఫెన్సింగ్ వేస్తూ, ‘రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పరిరక్షించాం’ అంటూ గొప్పలు చెప్పుకొంటున్నది. కానీ హైదరాబాద్ సియేట్ కాలనీలోని సున్నంచెరువు వద్ద హైడ్రా అసలు రూపం బయటపడింది. ఓవైపు సరైన వివరాలు సేకరించకుండానే నిర్మాణాలను కూల్చివేయగా, మరోవైపు తమ స్నేహితుడి కోసం హైడ్రా ఉన్నతాధికారి ఒకరు ప్లాన్‌నే మార్చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సున్నంచెరువు సమీపంలోని సర్వేనంబర్లు 12,13లో హైడ్రా 2024 సెప్టెంబర్‌లో కూల్చివేతలు చేపట్టింది. చెరువు హద్దుల్లో నిర్మాణాలు ఉండరాదంటూ కొత్తగా నిర్మిస్తున్న కొన్ని ఇండ్లను, అక్కడ వ్యాపారాలు చేసుకోరాదంటూ కొన్ని షెడ్లను సమూలంగా నేలమట్టం చేసింది. అన్నిరకాల అనుమతులు తీసుకున్నామని, రూ.లక్షలు ఖర్చుచేసి మూడు నాలుగు అంతస్తుల వరకు కట్టుకున్నామని ఆ భవన యజమానులు మొరపెట్టుకున్నా హైడ్రా అధికారులు వినలేదు. అనుమతి పత్రాలను చూపించే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు.
సరిగ్గా సంవత్సరం తర్వాత 2025 సెప్టెంబర్‌లో ఒక భవన యజమానికి హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ నుంచి ‘నో ఇష్యూ.. ప్లీజ్ గో ఎహెడ్ సార్’ అంటూ మెసేజ్ వచ్చింది. దీనిపై స్పందించిన ఆ యజమాని హైడ్రా కార్యాలయం చుట్టూ తిరుగుతూ, మున్సిపాలిటీలో అధికారులను కలుస్తూ విశ్వ ప్రయత్నాలు చేయగా, నెలల తర్వాత హైడ్రా అధికారులు ‘మళ్లీ ఇల్లు కట్టుకోవడానికి తమకు అభ్యంతరం లేదు’ అని చెప్పారని వాపోయారు. భవనం కూల్చేసే సమయంలో తాము అన్ని పర్మిషన్లు చూపించినా వినలేదని, రెండుమూడు సార్లు కమిషనర్ రంగనాథ్‌ను కూడా కలిశామని వారు పేర్కొన్నారు. చివరికి తమ ఏరియాకు సంబంధించిన హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌ను సంప్రదిస్తే తనకు తెలియకుండానే ఇల్లు కూల్చేశారని, సున్నంచెరువు దగ్గర కూల్చివేతల్లో తప్పు జరిగిందని ఆయన చెప్పారట. మీరు మళ్లీ కట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని, ఈ విషయంలో మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అభ్యంతరం రాకపోతే చాలని చెప్పారంటూ భవన యజమానులు తెలిపారు. హైడ్రా అనుమతి అనంతరం తాము మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభించామని చెప్తున్నారు. అయితే హైడ్రా తప్పుడు కూల్చివేతల కారణంగా తమకు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదే విషయంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కలిసినప్పుడు ఆయన నష్టపరిహారం కోసం కోర్టుకు వెళ్లాలని సలహా ఇచ్చారన్నారు. ప్రస్తుతం తమకు భవనం పూర్తి కావడమే ముఖ్యమని, తాము కోర్టుకెళ్లడం లేదని ఆ భవన యజమాని తెలిపారు. రెండురోజుల కిందట కూడా హైడ్రాసిబ్బంది తమ భవనం నుంచే కరెంట్ తీసుకున్నారని పేర్కొన్నారు.
సున్నంచెరువు విషయంలో హైడ్రా చేస్తున్న హద్దుల నిర్ధారణే తప్పుల తడకగా ఉన్నదని సియేట్ కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. సున్నం చెరువుకు సంబంధంలేని తమ ప్లాట్ల విషయంలో హైడ్రా చర్యలపై కేసు నడుస్తున్నదని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా హైడ్రా తమ ప్లాట్లలో ఫెన్సింగ్ వేసిందని బాధితులు తెలిపారు. ఒక ప్లాట్‌కు సంబంధించి హైడ్రా ఏకంగా అలైన్‌మెంట్‌నే మార్చేసిందని ఆరోపిస్తున్నారు. ఆ ప్లాట్ దగ్గర గతంలో హైడ్రా తవ్వకాలు చేపట్టిందని, కొన్నిరోజులకు అలైన్మెంట్ మార్చి కొంచెం ముందుకు తీసుకొచ్చిందని చెప్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఆ ప్లాట్ యజమానికి, హైడ్రా ఉన్నతాధికారికి మధ్య ఉన్న స్నేహమే అని అనుమానిస్తున్నారు. రోజూ హైడ్రా ఉన్నతాధికారి, ప్లాట్ యజమాని కలిసి వాకింగ్‌కు వెళ్తారని చెప్తున్నారు. అంతేగాకుండా ఆ అధికారి గతంలో రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారని, అందుకే ఆయనకు హైడ్రా మినహాయింపు ఇచ్చిందని సియేట్ కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. సున్నం చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను హైడ్రా ఎలా నిర్ధారిస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌ను ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి సంప్రదించగా.. కూల్చివేసిన చోట మళ్లీ నిర్మాణాలు ఎలా చేపడుతారని ఎదురు ప్రశ్నించారు. తమ సిబ్బందిని అప్రమత్తం చేస్తామని పేర్కొన్నారు.
సెప్టెంబర్ నెల.. పెద్దపెద్ద బుల్డోజర్లు, క్రేన్లతో వచ్చిన హైడ్రా సిబ్బంది అనేక భవనాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. తాము కూల్చివేసిన భవనాల వద్దకు ఎవరూ రావద్దని హైడ్రా హుకుం జారీచేసింది. ఆయా భవనాలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని మున్సిపాలిటీకి సిఫార్సు చేసింది.

సెప్టెంబర్ నెల.. గతంలో తాము కూల్చేసిన ఓ ఇంటి యజమానికి హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఒక మెసేజ్ పంపారు. ‘నో ఇష్యూ.. ప్లీజ్ గో ఎహెడ్ సార్’ అంటూ సందేశం పంపించారు. అంటే మీ భవనాన్ని మేము పొరబాటున కూల్చేశాం. మీరు మళ్లీ అదే స్థలంలో ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పారు.