కరుణ లేని కాంగ్రెస్ సర్కారు ఎక్కడ తమ ఇండ్లను కూల్చుతుందోనన్న భయంతో నాలుగైదు రోజులుగా కంటిమీద కునుకులేకుండా.. కంటికి మంటికి ధారగా ఏడుస్తూ వణుకుతున్న మూసీ నిర్వాసిత బాధితులు తెలంగాణ జనతా గ్యారేజ్ అయిన తెలంగాణ భవన్‌కు శనివారం తండోపతండాలుగా తరలివచ్చారు. కంటికి రెప్పయి కాపాడుకునే బీఆర్ఎస్తోనే తమకు భరోసా దొరుకుతుందన్న నమ్మకంతో బరువెక్కిన గుండెలపై పిల్లాపాపలను ఎత్తుకొని ఉదయాన్నే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి ఎదుట తమ గోడు వెళ్లబోసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వారి దుఃఖా న్ని చూసి చలించిపోయిన హరీశ్, సబిత సైతం కంటతడి పెట్టుకున్నారు. బాధితుల ఆక్రందన ఆసాంతం విని భరోసా ఇచ్చారు. ఆందోళన చెందవద్దని, బీఆర్ఎస్ అండగా ఉంటుందని, న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని, బాధితులపై పైసా భారం పడకుండా న్యాయ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
BRS | హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రతిరూప సౌధమది. అన్ని సందర్భాల్లో అభాగ్యులకు అండ అది. స్వరాష్ట్ర సమరంలో ఉద్యమకారులను గుండెల్లో దాచుకున్నట్టే ఇవ్వాళ మూసీ, హైడ్రా బాధితులకు తెలంగాణ భవన్ ఆలవాలమైంది. మొన్న రైతులు.. నిన్న ఉద్యోగార్థులు.. నేడు దయలేని కాంగ్రెస్ చేష్టలతో నిరాశ్రయులవుతున్న బడుగుజీవులకు గొడుగు పట్టింది. ఎండనకా..వాననకా నెత్తురు చెమటగ చేసి కట్టుకున్న ‘గూడు’ను రాత్రికి రాత్రే సర్కారు నేలమట్టం చేస్తే నిరాశ్రయులు తమ కాళ్ల మీద తాము నిలబడే ధైర్యమైంది. గోడువినే నాథుడే లేక దీనంగా ఎదురుచూసే పేదలకు దారిచూపే దీపమైంది. తెలంగాణ భవన్ ఇప్పుడు జనతాగ్యారేజ్ అవతారమెత్తింది.
గొలుసుకట్టుగా సాగుతున్న కూల్చివేతలతో ఆవేదన, ఆందోళన నిండిన తనవులతో వంతుల వారీగా మూసీ పరీవాహక ప్రాంత జనం గస్తీ తిరుగుతున్నారు. కూల్చివేతల్లో సర్వం కోల్పోయిన బాధితులు దిక్కుతోచక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. గోడు వెళ్లబోసుకుందామన్నా సర్కారు చెవులు మూసుకున్నది. గూడు చెదిరిన గుండెలు బెంగటిల్లుతున్నాయి. ఇలాంటి కష్టకాలంలో బాధితులకు అండగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ‘24/7 ఎప్పుడైనా సరే.. బాధితులెవరైనా సరే.. తెలంగాణ భవన్ తలుపు తట్టండి..మీకు అండగా మేము ఉంటాం’ అని ప్రకటించింది.
ఆ ప్రకటన కూల్చివేతల బాధితులకు కొండంత భరోసా అయి శనివారం ఉదయం నుంచే తెలంగాణ భవన్ మూసీ బాధితుల కన్నీళ్లతో ఉద్విగ్నం కావటం మొదలైంది. పిల్లాజెల్లా, ముసలీముతకతో గుడ్ల నిండా నీళ్లతో కడుపునిండా దుఃఖంతో బాధితులు రావడం కనిపించింది. సర్కారు తమ బతుకులను ఎట్లా చిత్రవధ చేస్తున్నదో చెప్పుకొనేందుకు ఎవరికివారుగా వందల సంఖ్యలో తరలివచ్చారు. హైదర్షాకోట్, చాదర్‌ఘాట్, బండ్లగూడ తదితర ప్రాంతాల నుంచి తండోపతండాలుగా వచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండు రోజులుగా తీవ్రజర్వంతో బాధపడుతుండడంతో ఆయన మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డికి సమాచారం అందించారు. ఉన్నపళంగా వారు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.
Harish Rao
అప్పటికే ఉద్విగ్నంగా మారిన తెలంగాణ భవన్‌కు మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు నేతలు చేరుకున్నారు. ఒక్కొక్కరి గాథలను ఓపిగ్గా విన్నారు. పేరుపేరునా.. కాలనీల వారీగా, బస్తీల వారీగా బాధితుల వేదనను నోట్ చేసుకున్నారు. పలు సందర్భాల్లో వారూ భావోద్వేగానికి లోనయ్యారు. బాధితులు కన్నీటి పర్యంతమవుతుంటే తట్టుకోలేకపోయారు. హరీశ్, సబిత కండ్లల్లోనూ నీళ్ల సుడులు తిరిగాయి. వారు మాట్లాతున్నప్పుడూ గద్గద స్వరంతో గొంతులు జీరబోయాయి. అన్నివిధాలా అండగా ఉంటామని అభయం ఇచ్చారు. అవసరమైతే బుల్డోజర్ ముందు తాము ఉంటామని ధైర్యం చెప్పారు.
ఆదివారం ఉదయం మాజీ మంత్రి హరీశ్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకుల బృందం మూసీ ప్రభావ ప్రాంతం హైదర్షా కోట్లో పర్యటించనుంది. తెలంగాణ భవన్‌కు వచ్చిన వారికి భరోసా ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు, నేడు స్వయంగా వెళ్లి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించనున్నారు.
ఒక్కొక్కరూ ఒక్కో కన్నీటిగాథై కదిలారు. ‘నేను వేరే రాష్ట్రం అమ్మాయిని. కోడలిగా ఇక్కడి (హైదరాబాద్)కి వచ్చినప్పటి నుంచి ఇలాంటి దారుణాన్ని చూడలేదు. ఇప్పుడు నేనే ఆ బాధ అనుభవిస్తానని కలలోకూడా అనుకోలేదు.. మేం ఏం పాపం చేసినం? రెండేండ్లు కిరాయి ఉండి.. పైసాపైసా పోగేసి పదేండ్ల కింద పర్మిషన్ తీసుకునే ఇల్లుకట్టుకున్నం. పన్నులు కడ్తుతున్నం. చెప్పాపెట్టకుండా వచ్చి కూలగొట్టారు. ఇప్పుడు ఎక్కడికి పోవాలి. మీ అత్తగారి ఊళ్లో బతకలేరా? అంటే మావాళ్లకు ఏమని సమాధానం చెప్పాలి?’ అని ఒకరు.. ‘మేం అభివృద్ధికి అడ్డం కాదు.
అన్నీ డాక్యుమెంట్లు చూసే కట్టుకున్నం. బ్యాంకులోన్ తీసుకున్నం. సక్రమంగా లేకపోతే లోన్ ఇవ్వరు కదా?. 2035 దాకా ఈఎంఐలు కట్టాలి. పిల్లలు చిన్నవాళ్లు.. ఇప్పుడెక్కడికి పోవాలి?’ అని ఒకరు. ‘ఎఫ్టీఎల్ను ఆక్రమించారు. బఫర్‌జోన్‌లో కట్టుకున్నారు. ఆక్రమణదారులు.. ఇలా రకరకాల ట్యాగ్లు వేస్తున్నారు. ఇండ్లు కూల్చి రోడ్డుమీద పడేశారు. మమ్మల్ని చిత్రవధ చేస్తున్నారు’ అని ఇంకొకరు ఇలా ఎవరిని కదిలించినా కన్నీటి ధారలే కురిశాయి.