HYDRAA | హైదరాబాద్, సెప్టెంబర్28 (నమస్తే తెలంగాణ): చెరువులు, నాలాల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా.. ఎలాంటి చట్టబద్ధత లేకున్నా ప్రభుత్వం దన్నుతో కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో పేదల నివాసాలపై విరుచుకుపడుతున్నది. విక్రయదారుల ను, రిజిస్ట్రేషన్ చేసిన, నిర్మాణ అనుమతులను మంజూరు చేసిన ఉద్యోగులను విడిచిపెట్టి ఆక్రమణల పేరిట పేదలపై కన్నెర్ర చేస్తూ వస్తున్నది.పెద్దల బంగ్లాలను విడిచిపెడుతూ, పేదల గుడిసెలను కూలగొడుతున్నది. ఈ అంశంపై కమిషనర్ రంగనాథ్ తీరుపై, హైడ్రా చర్యలపై ఆదినుంచీ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. ఈ చర్యలను ప్రశ్నించిన మీడియాను పక్కనపెట్టింది. కేవలం అనుకూల మీడియా ముందు ప్రత్యక్షమవడం, కూల్చివేతలకు సమర్థింపుగా ప్రకటనలు ఇచ్చేందుకే పరిమితమైంది. బాధితుల గోడును మాత్రం పట్టించుకున్న దాఖలాలేదు. వారి తరఫున ఇదేమని అడిగిన మీడియాకు హైడ్రా అధికారులు ముఖం చాటేసుకొని తిరిగారు.
ఒకానొక సందర్భంలో కార్యాలయానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై బెదిరింపులకు దిగారంటే హైడ్రా పోకడలను అర్థం చేసుకోవచ్చు. అదే దుందుడుకుతనంతో తాజాగా మూసీ పరీవాహక ప్రాంతంలో కూల్చివేతలకు మార్కింగ్ చేయడం, స్థానికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడం, ఎక్కడ గూడు చెదిరిపోతుందోనని మనోవేదనతో బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకోవడంతో ఎట్టకేలకు అధికారగణానికి పట్టిన దయ్యం వదిలింది. ఇంతకాలం దూరం పెట్టిన మీడియా ప్రతినిధులను హుటాహుటినా పిలిచి మరీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం నిర్వహించారు. కూల్చివేతలు, జరిగిన ఘటనలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దాదాపు గంటన్నరకు పైగా పాత్రికేయులతో భేటీ అయి, అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. మొత్తంగా ప్రజాప్రతిఘటన, బుచ్చమ్మ మరణంతో హైడ్రాకు కనువిప్పు కలిగిందని చర్చించుకుంటున్నారు.